Back to Languages

Telugu - Chapter 10 - Yunus

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Yunus 10:1

అలిఫ్ - లామ్ - రా. ఇవి వివేకంతో నిండి వున్న దివ్యగ్రంథం యొక్క ఆయతులు

Verse 2 — Surah Yunus 10:2

ఏమీ? మానవులను హెచ్చరించటానికి మరియు విశ్వసించిన వారికి నిశ్చయంగా, తమ ప్రభువు వద్ద, వారు చేసి పంపిన మంచిపనులకు తగిన స్థానం ఉంది." అనే శుభవార్త వినిపించటానికి, మేము వారిలోని ఒక మనిషి (ముహమ్మద్) పై మా సందేశాన్ని అవతరింప జేయటం ప్రజలకు ఆశ్చర్యకమైన విషయంగా ఉందా? (ఎందుకంటే) సత్యతిరస్కారులు ఇలా అన్నారు: "నిశ్చయంగా ఇతను పచ్చి మాంత్రికుడు

Verse 3 — Surah Yunus 10:3

నిశ్చయంగా మీ పోషకుడూ, ప్రభువూ అయిన అల్లాహ్, ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించి, తర్వాత తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్టించాడు. ఆయనే (సర్వసృష్టి) వ్యవహారాలను నడుపుతున్నాడు. ఆయన అనుమతి లేకుండా సిఫారసు చేయగలవాడు ఎవ్వడూ లేడు. ఆయనే అల్లాహ్! మీ పోషకుడు (ప్రభువు), కావున మీరు ఆయననే ఆరాధించండి. ఏమీ? మీరు హితోపదేశం స్వీకరించరా

Verse 4 — Surah Yunus 10:4

ఆయన వైపునకే మీరందరూ మరలి పోవలసి ఉంది. అల్లాహ్ వాగ్దానం నిజమైనది. నిశ్చయంగా, ఆయనే సృష్టిని మొదట సరిక్రొత్తగా ప్రారంభించాడు, మరల ఆయనే దానిని ఉనికిలోకి తెస్తాడు. ఇది విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి న్యాయమైన ప్రతిఫల మివ్వటానికి. మరియు సత్యాన్ని తిరస్కరించిన వారికి - వారు సత్యాన్ని తిరస్కరిస్తూ ఉండినందుకు - త్రాగటానికి సలసల కాగే నీళ్ళు మరియు బాధాకరమైన శిక్ష ఉంటాయి

Verse 5 — Surah Yunus 10:5

ఆయనే, సూర్యుణ్ణి (ప్రకాశించే) దీపంగానూ మరియు చంద్రుణ్ణి వెలుగును (ప్రతిబింబింపజేసే) దాని గానూ చేసి, దానికి (పెరిగే - తరిగే) దశలు నియమించాడు, దాని ద్వారా మీరు సంవత్సరాల మరియు (కాలపు) గణనను తెలుసుకోవాలని. అల్లాహ్ ఇదంతా సత్యాధారంగా తప్ప సృష్టించలేదు. జ్ఞానం గల వారికి ఆయన తన సూచనలను (ఈ విధంగా) విశదీకరిస్తున్నాడు

Verse 6 — Surah Yunus 10:6

నిశ్చయంగా, రేయింబవళ్ళ నిరంతర మార్పులలోనూ మరియు భూమ్యాకాశాలలో అల్లాహ్ సృష్టించిన ప్రతిదానిలోనూ, దైవభీతి గల ప్రజలకు సూచనలున్నాయి

Verse 7 — Surah Yunus 10:7

నిశ్చయంగా, ఎవరైతే మమ్మల్ని కలుసుకోవటాన్ని ఆశించక, ఇహలోక జీవితంతోనే సంతసించి, దానితోనే తృప్తి చెందుతారో మరియు మా సూచన (ఆయాత్) లను గురించి నిర్లక్ష్యభావం కలిగి ఉంటారో

Verse 8 — Surah Yunus 10:8

అలాంటి వారి ఆశ్రయం - తమ కర్మలకు ఫలితంగా - నరకాగ్నియే

Verse 9 — Surah Yunus 10:9

నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారిని వారి విశ్వాసఫలితంగా వారి ప్రభువు వారిని సన్మార్గం మీద నడిపిస్తాడు. వారి క్రింద పరమ సుఖాలతో నిండి ఉన్న స్వర్గవనాలలో, సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి

Verse 10 — Surah Yunus 10:10

అందులో వారి ప్రార్థన: "ఓ అల్లాహ్! నీవు సర్వలోపాలకు అతీతుడవు." అని మరియు వారి అభివందనం: "అస్సలాము అలైకుం (మీకు శాంతి కలుగు గాక)!" అని, మాత్రమే ఉంటాయి. మరియు వారు తమ ప్రార్థనలను: "సర్వస్తోత్రాలకు అర్హుడు సమస్తలోకాల పోషకుడైన అల్లాహ్ మాత్రమే!" అని ముగించుకుంటారు

Verse 11 — Surah Yunus 10:11

మరియు ప్రజలు తమ మేలు కొరకు తొందర పడినట్లు అల్లాహ్ వారిపై (వారి చేష్టలకు) కీడును పంపటంలో తొందర పడి ఉంటే, వారి వ్యవధి ఎప్పుడో పూర్తయి ఉండేది. అందువలన మేము, మమ్మల్ని కలుసుకునే నమ్మకంలేని వారిని, తమ తలబిరుసుతనంలో భ్రష్టులై తిరగటానికి వదలిపెడుతున్నాము

Verse 12 — Surah Yunus 10:12

మరియు మానవునికి కష్టకాలం వచ్చినప్పుడు: అతడు పరుండినా, కూర్చుండినా లేక నిలుచుండినా, మమ్మల్ని ప్రార్థిస్తాడు. కాని మేము అతని ఆపదను తొలగించిన వెంటనే, అతడు తనకు కలిగిన కష్టానికి, ఎన్నడూ మమ్మల్ని ప్రార్థించనే లేదు, అన్నట్లు ప్రవర్తిస్తాడు. ఈ విధంగా మితిమీరి ప్రవర్తించే వారికి, వారి చేష్టలు ఆకర్షణీయమైనవిగా చూపబడతాయి

Verse 13 — Surah Yunus 10:13

మరియు వాస్తవంగా మీకు పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము, ఎందుకంటే వారు దుర్మార్గపు వైఖరిని అవలంబించారు; మరియు వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చినా, వారు విశ్వసించలేదు. ఈ విధంగా మేము అపరాధులకు ప్రతీకారం చేస్తాము

Verse 14 — Surah Yunus 10:14

వారి తరువాత - మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో చూడటానికి - మేము మిమ్మల్ని భూమికి వారసులుగా చేశాము

Verse 15 — Surah Yunus 10:15

మరియు మా స్పష్టమైన ఆయతులను వారికి చదివి వినిపించినప్పుడు - మమ్మల్ని కలుసుకునే నమ్మకం లేనివారు - అంటారు: "దీనికి బదులుగా మరొక ఖుర్ఆన్ తీసుకురా లేదా ఇందులో సవరణలు చెయ్యి." (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "ఇందులో నా అంతట నేను మార్పులు చేయటం నా పని కాదు. నా వద్దకు పంపబడే దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే నేను అనుసరిస్తాను. నిశ్చయంగా, నేను నా ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘిస్తే, ఆ గొప్ప దినమున శిక్ష పడుతుందని భయపడుతున్నాను

Verse 16 — Surah Yunus 10:16

(ఇంకా ఇలా) అను: "ఒకవేళ అల్లాహ్ కోరితే, నేను దీనిని మీకు వినిపించి ఉండేవాడిని కాదు; మరియు ఆయన కూడా దీనిని మీకు తెలిపి ఉండేవాడు కాదు. వాస్తవంగా నేను దీనికి (ఈ గ్రంథ అవతరణకు) పూర్వం మీతో నా వయస్సులోని దీర్ఘకాలాన్ని గడిపాను కదా? ఏమీ? మీరిది గ్రహించలేరా

Verse 17 — Surah Yunus 10:17

ఇక అబద్ధాన్ని కల్పించి, దానిని అల్లాహ్ కు ఆపాదించే వాడి కంటే, లేక ఆయన సూచన (ఆయాత్) లను అబద్ధాలని తిరస్కరించే వాడి కంటే, మహా దుర్మార్గుడెవడు? నిశ్చయంగా, పాపులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు

Verse 18 — Surah Yunus 10:18

మరియు వారు అల్లాహ్ ను కాదని తమకు నష్టం గానీ, లాభం గానీ కలిగించలేని వాటిని ఆరాధిస్తున్నారు. మరియు వారు ఇలా అంటున్నారు: "వీరు మాకు అల్లాహ్ వద్ద సిఫారసు చేసేవారు." వారినడుగు: "ఏమీ? ఆకాశాలలో గానీ, భూమిలో గానీ, అల్లాహ్ ఎరుగని విషయాన్ని, మీరు ఆయనకు తెలుపగోరుతున్నారా?" ఆయన సర్వలోపాలకు అతీతుడు, మీరు సాటి కల్పించే వాటి కంటే ఆయన అత్యున్నతుడు

Verse 19 — Surah Yunus 10:19

మరియు మానవులందరూ మొదట ఒకే సంఘంగా (ఒకే ధర్మం మీద) ఉండేవారు. కానీ, వారు తరువాత భిన్నాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు నీ ప్రభువు తరఫు నుండి ముందుగానే ఈ విషయం నిర్ణయించ బడకుండా ఉండి ఉన్నట్లయితే, వారి మధ్య ఉన్న ఈ విభేదాల తీర్పు ఎప్పుడో జరిగి వుండేది

Verse 20 — Surah Yunus 10:20

మరియు వారంటున్నారు: "అతనిపై అతని ప్రభువు తరఫు నుండి ఏదైనా (అద్భుత) సంకేతం ఎందుకు అవతరింప జేయబడలేదు?" నీవిలా జవాబివ్వు: "నిశ్చయంగా అగోచర విషయ జ్ఞానం కేవలం అల్లాహ్ కే చెందుతుంది, కావున వేచి ఉండండి! నిశ్చయంగా, నేను కూడా మీతో బాటు వేచి ఉంటాను

Verse 21 — Surah Yunus 10:21

మరియు మానవులకు ఆపద కలిగిన పిదప, మేము వారికి కారుణ్యం రుచి చూపిస్తే, వెంటనే వారు మా సూచనలకు విరుద్ధంగా ఎత్తుగడలు వేయటం ప్రారంభిస్తారు. వారితో అను: "ఎత్తుగడలు వేయటంలో అల్లాహ్ అతి శీఘ్రుడు!" నిశ్చయంగా, మా దూతలు మీరు చేసే ఎత్తుగడలన్నింటినీ వ్రాస్తున్నారు

Verse 22 — Surah Yunus 10:22

ఆయన (అల్లాహ్) యే! మిమ్మల్ని భూమిలోను మరియు సముద్రంలోనూ ప్రయాణింప జేయగలవాడు. ఇక మీరు ఓడలలో ఉన్నప్పుడు: అవి వారితో సహా, అనుకూలమైన గాలి వీస్తూ ఉండగా పోతూ ఉంటాయి మరియు దానితో వారు ఆనందిస్తూ ఉంటారు. (అకస్మాత్తుగా) వారిపైకి తీవ్రమైన తుఫాను గాలి వస్తుంది మరియు ప్రతిదిక్కు నుండి వారి మీదికి పెద్ద పెద్ద అలలు వస్తాయి మరియు వారు వాటి వల్ల వారు నిశ్చయంగా, చుట్టుకోబడ్డామని భావించి, అల్లాహ్ ను వేడుకుంటారు. తమ ధర్మం (ప్రార్థన)లో కేవలం ఆయననే ప్రత్యేకించుకొని ఇలా ప్రార్థిస్తారు: "ఒకవేళ నీవు మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడితే మేము నిశ్చయంగా కృతజ్ఞతలు చూపేవారమై ఉంటాము

Verse 23 — Surah Yunus 10:23

కాని, ఆయన వారిని కాపాడిన వెంటనే, వారు భూమిలో అన్యాయంగా దౌర్జన్యం చేయసాగుతారు. ఓ మానవులారా! నిశ్చయంగా, మీ దౌర్జన్యాలు మీకే హాని కలిగిస్తాయి. ఇహలోక జీవితం తాత్కాలిక ఆనందమే. చివరకు మీకు మా వైపునకే మరలి రావలసి ఉన్నది, అప్పుడు మేము, మీరు చేస్తూ ఉండిన కర్మలన్నీ మీకు తెలియజేస్తాము

Verse 24 — Surah Yunus 10:24

వాస్తవానికి ఈ ప్రాపంచిక జీవితాన్ని ఇలా పోల్చవచ్చు: మేము ఆకాశం నుండి నీటిని కురిపించగా దాని నుండి భూమిలో మానవులకు మరియు పశువులకు తినటానికి, వివిధ రకాల చెట్లూ చేమలూ పెరుగుతాయి. అప్పుడు భూమి తన అలంకారంతో వర్ధిల్లుతూ ఉండగా, దాని యజమానులు నిశ్చయంగా, అది తమ వశంలో ఉందనుకుంటారు; అలాంటి సమయంలో అకస్మాత్తుగా రాత్రి పూటనో లేక పగటి పూటనో మా తీర్పు వస్తుంది. అప్పుడు మేము దానిని - నిన్నటి వరకు ఏమీ లేని - కోసివేసిన పంటపొలంగా మార్చివేస్తాము. ఈ విధంగా మేము మా సూచనలను ఆలోచించే ప్రజల కొరకు స్పష్టంగా వివరిస్తాము

Verse 25 — Surah Yunus 10:25

మరియు అల్లాహ్ మిమ్మల్ని శాంతినిలయం (దారుస్సలాం) వైపునకు ఆహ్వానిస్తున్నాడు. మరియు ఆయన తాను కోరిన వానికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తాడు

Verse 26 — Surah Yunus 10:26

మంచిపనులు చేసిన వారికి, మంచి ఫలితం దొరుకుతుంది. మరియు ఇంకా ఎక్కువ లభిస్తుంది. మరియు వారి ముఖాలు నల్లబడవు మరియు వారికి అవమానమూ జరుగదు. అలాంటి వారు స్వర్గవాసులు. వారందు శాశ్వతంగా ఉంటారు

Verse 27 — Surah Yunus 10:27

మరియు పాపకార్యాలు చేసిన వారికి, వారి పాపాలకు తగినట్టి ప్రతిఫలం లభిస్తుంది మరియు వారిని అవమానం క్రమ్ముకుంటుంది. అల్లాహ్ నుండి వారిని రక్షించేవాడెవ్వడూ ఉండడు. వారి ముఖాలు చీకటి రాత్రి యొక్క నల్లని తెరల వంటి వాటితో కప్పబడి ఉంటాయి. అలాంటి వారు నరకాగ్ని వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు

Verse 28 — Surah Yunus 10:28

మరియు మేము వారందరినీ సమావేశపరచిన రోజు, సాటి కల్పించిన (షిర్కు చేసిన) వారితో ఇలా అంటాము: "మీరునూ మరియు మీరు అల్లాహ్ కు సాటి కల్పించిన వారునూ, మీ స్థానాలలోనే ఆగండి!" ఆ పిదప మేము వారిని వేరు చేస్తాము. వారు అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించినవారు (వారి దైవాలు) ఇలా అంటారు: "మీరు ఆరాధిస్తూ ఉండేది మమ్మల్ని కాదు

Verse 29 — Surah Yunus 10:29

ఇక మీకూ మరియు మాకూ మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు. నిశ్చయంగా, మీరు (చేస్తూ వున్న) ఆరాధన గురించి మాకు ఏ మాత్రం తెలియదు

Verse 30 — Surah Yunus 10:30

అక్కడ ప్రతి వ్యక్తీ తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను తెలుసుకుంటాడు. అందరూ తమ వాస్తవ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు మరియు వారు కల్పించుకున్న (బూటకదైవాలన్నీ) వారిని వీడి పోతాయి

Verse 31 — Surah Yunus 10:31

వారిని అడుగు: "ఆకాశం నుండి మరియు భూమి నుండి, మీకు జీవనోపాధిని ఇచ్చేవాడు ఎవడు? వినేశక్తీ, చూసేశక్తీ ఎవడి ఆధీనంలో ఉన్నాయి? మరియు ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని మరియు ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? మరియు ఈ విశ్వ వ్యవస్థను నడుపుతున్నవాడు ఎవడు?" వారు: "అల్లాహ్!" అని తప్పకుండా అంటారు. అప్పుడను: "అయితే మీరు దైవభీతి కలిగి ఉండరా

Verse 32 — Surah Yunus 10:32

ఆయనే అల్లాహ్! మీ నిజమైన ప్రభువు. అయితే సత్యం తరువాత, మార్గభ్రష్టత్వం తప్ప మిగిలేదేమిటి? అయితే మీరు ఎందుకు (సత్యం నుండి) తప్పించబడుతున్నారు

Verse 33 — Surah Yunus 10:33

ఈ విధంగా దుష్టులైన వారి విషయంలో వారెన్నడూ విశ్వసించరని, నీ ప్రభువు అన్న మాట నిజమయింది

Verse 34 — Surah Yunus 10:34

వారిని అడుగు: "మీరు అల్లాహ్ కు సాటిగా కల్పించుకున్న వారిలో సృష్టిని మొదటిసారి ఆరంభించేవాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా?" ఇలా అను: "సృష్టి ఆరంభించేవాడు, దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడూ కేవలం అల్లాహ్ మాత్రమే! అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)

Verse 35 — Surah Yunus 10:35

వారిని అడుగు: "మీరు అల్లాహ్ కు సాటి కల్పించుకున్న వారిలో సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు, ఎవడైనా ఉన్నాడా?" ఇంకా ఇలా అను: "కేవలం అల్లాహ్ యే సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు. ఏమీ? సత్యం వైపునకు మార్గదర్శకత్వం చేసేవాడు విధేయతకు ఎక్కువ అర్హుడా? లేక మార్గదర్శకత్వం చేయబడితేనే తప్ప స్వయంగా సన్మార్గం పొందలేని వాడా? అయితే మీకేమయింది? మీరెలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు

Verse 36 — Surah Yunus 10:36

మరియు వారిలో చాలా మంది తమ ఊహలను మాత్రమే అనుసరించే వారున్నారు. నిశ్చయంగా ఊహ, సత్య (అవగాహనకు) ఏ మాత్రం పనికిరాదు. నిశ్చయంగా, వారు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు

Verse 37 — Surah Yunus 10:37

మరియు అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా ఈ ఖుర్ఆన్ కల్పించబడటం సంభవం కాదు; వాస్తవానికి ఇది (పూర్వగ్రంథాలలో) మిగిలి ఉన్న దానిని (సత్యాన్ని) ధృవపరుస్తోంది మరియు ఇది (ముఖ్య సూచనలను) వివరించే గ్రంథం; ఇది సమస్త లోకాల పోషకుని (అల్లాహ్) తరఫు నుండి వచ్చిందనటంలో ఎలాంటి సందేహం లేదు

Verse 38 — Surah Yunus 10:38

అయినా వారు: "అతనే (ముహమ్మదే) దీనిని కల్పించాడు." అని అంటున్నారా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే - అల్లాహ్ ను విడిచి మీరు పిలువ గలిగే వారినందరినీ (మీ సహాయానికి) పిలుచుకొని - దీని వంటి ఒక్క సూరహ్ నైనా (రచించి) తీసుకురండి

Verse 39 — Surah Yunus 10:39

కాని వారు - దాని జ్ఞానాన్ని ఇముడ్చుకొనక ముందే మరియు దాన వ్యాఖ్యానం వారి వద్దకు రాకముందే - దానిని అబద్ధమని తిరస్కరించారు. వీరికి పూర్వమున్న వారు కూడా ఈ విధంగానే అబద్ధమని తిరస్కరించారు. కావున, చూశారా! ఆ దుర్మార్గుల ముగింపు ఎలా జరిగిందో

Verse 40 — Surah Yunus 10:40

మరియు వారిలో కొందరు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) నమ్మేవారున్నారు మరికొందరు దీనిని నమ్మనివారున్నారు. మరియు దౌర్జన్యపరులు ఎవరో నీ ప్రభువుకు బాగా తెలుసు

Verse 41 — Surah Yunus 10:41

మరియు ఒకవేళ వారు నిన్ను అసత్యుడవని తిరస్కరిస్తే, వారితో అను: "నా కర్మలు నాకు మరియు మీ కర్మలు మీకు. నా కర్మలకు మీరు బాధ్యులు కారు మరియు మీ కర్మలకు నేను బాధ్యుడను కాను

Verse 42 — Surah Yunus 10:42

మరియు వారిలో కొందరు నీ మాటలను వింటూ ఉంటారు! ఏమీ? నీవు చెవిటి వారికి వినిపించ గలవా? మరియు వారు ఏమీ అర్థం చేసు కోలేక పోయినప్పటికీ (వారికి వినిపించగలవా)

Verse 43 — Surah Yunus 10:43

మరియు వారిలో కొందరు నీ వైపునకు చూస్తూ ఉంటారు. ఏమీ? నీవు గ్రుడ్రివారికి సరైన మార్గం చూపించగలవా? మరియు వారికి ఏమీ కనిపించనప్పటికి కూడానా

Verse 44 — Surah Yunus 10:44

నిశ్చయంగా, అల్లాహ్ మానవులకు ఎలాంటి అన్యాయం చేయడు, కాని మానవులే తమకు తాము అన్యాయం చేసుకుంటారు

Verse 45 — Surah Yunus 10:45

మరియు ఆయన (అల్లాహ్) వారిని సమావేశపరచే రోజు, ఒక దినపు ఒక ఘడియ కంటే ఎక్కువ కాలం (ఇహలోకంలో) గడపలేదని వారు భావిస్తారు. వారు ఒకరినొకరు గుర్తుపడతారు. వాస్తవానికి అల్లాహ్ ను దర్శించ వలసివున్న సత్యాన్ని నిరాకరించిన వారు, తీవ్రమైన నష్టానికి గురి అవుతారు మరియు వారు మార్గదర్శకత్వాన్ని పొందలేక పోయారు

Verse 46 — Surah Yunus 10:46

మరియు (ఓ ముహమ్మద్!) మేము వాస్తవానికి వారికి వాగ్దానం చేసిన (శిక్షలలో) కొన్నింటిని నీకు చూపినా, లేక (అంతకు ముందే) నిన్నూ మరణింపజేసినా, వారు మా వైపుకే కదా మరలి రావలసి వున్నది. చివరకు వారి కర్మలన్నింటికీ అల్లాహ్ యే సాక్షి

Verse 47 — Surah Yunus 10:47

మరియు ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త (పంపబడ్డాడు). ఎప్పుడైతే వారి ప్రవక్త వస్తాడో, అప్పుడు వారి మధ్య (వ్యవహారాల) తీర్పు న్యాయంగా చేయబడుతుంది. మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు

Verse 48 — Surah Yunus 10:48

మరియు వారిలా అడుగుతున్నారు: "మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు పూర్తి కానున్నది

Verse 49 — Surah Yunus 10:49

(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "అల్లాహ్ కోరితే తప్ప! నా కొరకు నేను కీడుగానీ, మేలుగానీ చేసుకోగలిగే శక్తి నాకు లేదు. ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. వారి గడువు వచ్చినపుడు వారు ఒక ఘడియ వెనక గానీ లేక ముందు గానీ కాలేరు

Verse 50 — Surah Yunus 10:50

వారితో అను: "ఏమీ? మీరు ఆలోచించారా (చూశారా)! ఒకవేళ ఆయన శిక్ష మీపై రాత్రిగానీ, లేక పగలు గానీ వచ్చి పడితే (మీరేం చేయగలరు)? అయితే దేని కొరకు ఈ అపరాధులు తొందర పెడుతున్నారు

Verse 51 — Surah Yunus 10:51

ఏమి? అది (ఆ శిక్ష) మీపై వచ్చిపడిన తరువాతనే మీరు దానిని నమ్ముతారా? (ఆ రోజు మీరిలా అడగబడతారు): "ఇప్పుడా (మీరు దానిని నమ్మేది)? వాస్తవానికి మీరు దాని కొరకు తొందరపడ్తూ ఉండేవారు కదా

Verse 52 — Surah Yunus 10:52

అప్పుడు దుర్మార్గులతో ఇలా అనబడుతుంది: "మీరు శాశ్వతమైన శిక్షను అనుభవించండి! మీకు - మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రతిఫలం తప్ప - వేరే (శిక్ష) విధించబడునా

Verse 53 — Surah Yunus 10:53

మరియు (ఓ ముహమ్మద్!) వారు ఇంకా ఇలా అడుగుతున్నారు: " ఏమీ? ఇదంతా సత్యమేనా? వారితో అను: "అవును, నా ప్రభువు సాక్షిగా! ఇదంతా నిశ్చయంగా, జరగబోయే సత్యమే! మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు

Verse 54 — Surah Yunus 10:54

మరియు దుర్మార్గం చేసిన ప్రతి వ్యక్తి వద్ద ఒకవేళ వాస్తవానికి భూమిలో ఉన్న ధనమంతా ఉన్నా, దానిని అంతా పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతాడు, (కాని అది స్వీకరించబడదు). మరియు వారు ఆ శిక్షను చూసినప్పుడు లోలోపల పశ్చాత్తాప పడతారు. మరియు వారి మధ్య తీర్పు న్యాయంగా జరుగుతుంది. మరియు వారికెలాంటి అన్యాయం జరుగదు

Verse 55 — Surah Yunus 10:55

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ ఉన్న సమస్తమూ, అల్లాహ్ కే చెందినది. తెలుసుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం, కాని చాలా మందికి ఇది తెలియదు

Verse 56 — Surah Yunus 10:56

ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు

Verse 57 — Surah Yunus 10:57

ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం (ఈ ఖుర్ఆన్) వచ్చింది మరియు ఇది మీ హృదయాల (రోగాల) కు స్వస్థత నిస్తుంది. మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ప్రసాదిస్తుంది)

Verse 58 — Surah Yunus 10:58

ఇలా అను: "ఇది అల్లాహ్ అనుగ్రహం వల్ల మరియు ఆయన కారుణ్యం వల్ల, కావున దీనితో వారిని ఆనందించమను, ఇది వారు కూడబెట్టే దానికంటే ఎంతో మేలైనది

Verse 59 — Surah Yunus 10:59

ఇలా అను: "మీరు ఆలోచించారా! అల్లాహ్ మీ కొరకు అవతరింపజేసిన జీవనోపాధిలో నుండి మీరు స్వయంగానే కొన్నింటిని ధర్మసమ్మతం, మరికొన్నింటిని నిషేధం చేసుకున్నారు." ఇలా అడుగు: "ఏమీ అల్లాహ్ దీనికి అనుమతినిచ్చాడా? లేదా మీ బూటక కల్పనలను అల్లాహ్ కు అంటగట్టు తున్నారా

Verse 60 — Surah Yunus 10:60

మరియు అల్లాహ్ పై అబద్ధాలు కల్పించేవారు, తీర్పుదినమును గురించి ఏమనుకుంటున్నారు? నిశ్చయంగా, అల్లాహ్ మానవుల యెడల అత్యంత అనుగ్రహం కలవాడు, కాని చాలా మంది కృతజ్ఞతలు చూపరు

Verse 61 — Surah Yunus 10:61

మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ కార్యంలో ఉన్నా మరియు ఖుర్ఆన్ నుండి నీవు దేనిని పఠిస్తూ ఉన్నా మరియు (ఓ మానవులారా!) మీరు ఏమి చేస్తూ ఉన్నా! మీరు మీ పనులలో నిమగ్నులై ఉన్నప్పుడు, మేము మిమ్మల్ని కనిపెట్టుకునే ఉంటాము. భూమ్యాకాశాలలో ఉన్నటువంటి ఒక రవంత (పరమాణువంత) వస్తువైనా, దాని కంటే చిన్నదైనా లేదా పెద్దదైనా, నీ ప్రభువు దృష్టి నుండి మరుగుగా లేదు. అదంతా ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాయబడి ఉంది

Verse 62 — Surah Yunus 10:62

వినండి! నిశ్చయంగా, అల్లాహ్ కు ప్రియులైన వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా

Verse 63 — Surah Yunus 10:63

ఎవరైతే విశ్వసించారో మరియు దైవభీతి కలిగి ఉంటారో

Verse 64 — Surah Yunus 10:64

వారికి ఇహలోక జీవితంలోనూ మరియు పరలోకంలోనూ శుభవార్త ఉంటుంది. అల్లాహ్ పలుకులలో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే ఆ గొప్ప సాఫల్యం (విజయం)

Verse 65 — Surah Yunus 10:65

మరియు (ఓ ముహమ్మద్!) వారి మాటలు నిన్ను దుఃఖింప జేయకూడదు. నిశ్చయంగా, శక్తి (గౌరవం) అంతా అల్లాహ్ కే చెందుతుంది. ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

Verse 66 — Surah Yunus 10:66

వినండి! నిశ్చయంగా, ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కే చెందుతుంది. మరియు అల్లాహ్ ను కాదని ఆయనకు భాగస్వాములను కల్పించి వారిని ప్రార్థించేవారు, ఎవరిని అనుసరిస్తున్నారు? వారు అనుసరిస్తున్నది కేవలం తమ భ్రమలనే. మరియు వారు కేవలం ఊహాగానాలు మాత్రమే చేస్తున్నారు

Verse 67 — Surah Yunus 10:67

ఆయనే మీ కొరకు రాత్రిని విశ్రాంతి పొందటానికి మరియు పగటిని (సంపాదించటానికి) ప్రకాశవంతంగా చేశాడు. నిశ్చయంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో సూచనలున్నాయి

Verse 68 — Surah Yunus 10:68

అల్లాహ్ (ఒకడ్ని) కొడుకుగా చేసుకున్నాడు." అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది! ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ? అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు అంటారా

Verse 69 — Surah Yunus 10:69

ఇలా అను: "నిశ్చయంగా, అల్లాహ్ కు అబద్ధం అంటగట్టేవారు ఎన్నటికీ సాఫల్యం పొందరు

Verse 70 — Surah Yunus 10:70

ఇహలోకంలో వారు కొంతకాలం సుఖాలు అనుభవించవచ్చు! కాని తరువాత మా వైపునకే, వారికి మరలి రావలసి ఉంది. అప్పుడు మేము వారి సత్యతిరస్కారానికి ఫలితంగా, వారికి కఠినశిక్షను రుచి చూపుతాము

Verse 71 — Surah Yunus 10:71

మరియు వారికి నూహ్ గాథను వినిపించు. అతను తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నా జాతి సోదరులారా! నేను మీతో ఉండటం మరియు అల్లాహ్ సూచన (ఆయాత్) లను బోధించటం, మీకు బాధాకరమైనదిగా ఉంటే! నేను మాత్రం అల్లాహ్ నే నమ్ముకున్నాను. మీరూ మరియు మీరు అల్లాహ్ కు సాటి కల్పించినవారూ, అందరూ కలిసి ఒక (పన్నాగపు) నిర్ణయం తీసుకోండి, తరువాత మీ నిర్ణయంలో మీకెలాంటి సందేహం లేకుండా చూసుకోండి. ఆ పిదప ఆ పన్నాగాన్ని నాకు వ్యతిరేకంగా ప్రయోగించండి; నాకు ఏ మాత్రం వ్యవధి నివ్వకండి

Verse 72 — Surah Yunus 10:72

కాని, ఒకవేళ మీరు వెనుదిరిగితే, నేను మాత్రం మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు! నా ప్రతిఫలం కేవలం అల్లాహ్ దగ్గర ఉంది. మరియు నేను కేవలం అల్లాహ్ కే విధేయుడను (ముస్లిం) అయి ఉండాలని ఆజ్ఞాపించబడ్డాను

Verse 73 — Surah Yunus 10:73

కాని, వారు అబద్ధీకుడని తిరస్కరించారు. కావున మేము అతనిని మరియు అతనితో పాటు ఓడలో ఉన్నవారిని రక్షించి, వారిని భూమికి వారసులుగా చేశాము. మరియు మా సూచనలను అబద్ధాలని తిరస్కరించిన వారిని ముంచి వేశాము. కావున చూడండి, హెచ్చరిక చేయబడినా (విశ్వసించని) వారి గతి ఏమయిందో

Verse 74 — Surah Yunus 10:74

అతని (నూహ్) తరువాత ప్రవక్తలను వారి వారి జాతులవారి వద్దకు పంపాము. వారు, వారి వద్దకు స్పష్టమైన నిదర్శనాలు తీసుకొని వచ్చినా! వారు మొదట అబద్ధమని తిరస్కరించిన విషయాన్ని మళ్ళీ విశ్వసించ లేక పోయారు. ఈ విధంగా మేము హద్దులు మీరి ప్రవర్తించే వారి హృదయాల మీద ముద్ర వేస్తాము

Verse 75 — Surah Yunus 10:75

ఇక వారి తరువాత, మూసా మరియు హారూన్ లను మా సూచనలతో ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపితే, వారు దురహంకారం చూపారు. వారు అపరాధులైన జనులు

Verse 76 — Surah Yunus 10:76

కావున మా వద్ద నుండి సత్యం వారి ముందుకు వచ్చినపుడు వారు: "నిశ్చయంగా, ఇది స్పష్టమైన మంత్రజాలమే! " అని అన్నారు

Verse 77 — Surah Yunus 10:77

మూసా అన్నాడు: "ఏమీ? సత్యం మీ ముందుకు వచ్చిన తరువాత కూడా ఇలా అంటారా? ఏమీ? ఇది మంత్రజాలమా? మరియు మాంత్రికులు ఎన్నడూ సాఫల్యం పొందరు కదా

Verse 78 — Surah Yunus 10:78

వారన్నారు: "మా తండ్రితాతలు నడిచిన మార్గం నుండి మమ్మల్ని మళ్ళించాలని మరియు మీ ఇద్దరి పెద్దరికాన్ని భూమిలో స్థాపించాలనా, మీరిద్దరూ వచ్చింది? మరియు మేము మీ ఇద్దరినీ ఏ మాత్రం విశ్వసించము

Verse 79 — Surah Yunus 10:79

మరియు ఫిర్ఔన్ (తన వారితో) అన్నాడు: "నేర్పుగల ప్రతి మాంత్రికుణ్ణి నా వద్దకు తీసుకురండి

Verse 80 — Surah Yunus 10:80

మాంత్రికులు వచ్చిన తరువాత మూసా వారితో: "మీరు విసర దలచుకున్న వాటిని విసరండి!" అని అన్నాడు

Verse 81 — Surah Yunus 10:81

వారు విసరగానే మూసా: "మీరు విసిరింది మంత్రజాలం. నిశ్చయంగా, అల్లాహ్ దానిని భంగ పరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ దౌర్జన్యపరుల కార్యాలను చక్కబడనివ్వడు

Verse 82 — Surah Yunus 10:82

మరియు అల్లాహ్ తన ఆజ్ఞతో సత్యాన్ని సత్యంగా నిరూపిస్తాడు, అది అపరాధులకు ఎంత అసహ్యకరమైనా సరే

Verse 83 — Surah Yunus 10:83

కాని ఫిర్ఔన్ మరియు అతని నాయకులు తమను హింసిస్తారేమో అనే భయంతో! అతని జాతివారి లోని కొందరు ప్రజలు తప్ప ఇతరులు మూసాను విశ్వసించలేదు. మరియు వాస్తవానికి, ఫిర్ఔన్ దేశంలో ప్రాబల్యం వహించి ఉండేవాడు. మరియు నిశ్చయంగా, అతడు మితిమీరి ప్రవర్తించేవారిలో ఒకడుగా ఉండేవాడు

Verse 84 — Surah Yunus 10:84

మరియు మూసా అన్నాడు: "నా జాతి ప్రజలారా! మీకు నిజంగానే అల్లాహ్ మీద విశ్వాసం ఉంటే మరియు మీరు నిజంగానే అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయితే, మీరు ఆయన (అల్లాహ్) పైననే నమ్మకం ఉంచుకోండి

Verse 85 — Surah Yunus 10:85

అప్పుడు వారిలా జవాబిచ్చారు: "మేము అల్లాహ్ నే నమ్ముకున్నాము. ఓ మా ప్రభూ! మమ్మల్ని దుర్మార్గులకు పరీక్షా సాధనంగా చేయకు

Verse 86 — Surah Yunus 10:86

మరియు నీ కారుణ్యంతో మమ్మల్ని సత్యతిరస్కార ప్రజల నుండి కాపాడు

Verse 87 — Surah Yunus 10:87

మరియు మేము మూసాకు మరియు అతని సోదరునికి ఇలా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మీరు, మీ జాతివారి కొరకు ఈజిప్టులో గృహాలను సమకూర్చుకోండి. మరియు మీ గృహాలను, ప్రార్థనా స్థలాలుగా చేసుకొని నమాజ్ లను స్థాపించండి. మరియు విశ్వాసులకు శుభవార్తలు ఇవ్వు

Verse 88 — Surah Yunus 10:88

మూసా ఇలా ప్రార్థించాడు: "ఓ మా ప్రభూ! నిశ్చయంగా, నీవు ఫిర్ఔన్ కు మరియు అతని నాయకులకు ఇహలోక జీవితంలో వైభవం మరియు సంపదలను ప్రసాదించావు. ఓ మా ప్రభూ! వారిని (ప్రజలను) నీ మార్గం నుండి తప్పించటానికా ఇవి? ఓ మా ప్రభూ! వారి సంపదలను ధ్వంసం చేయి, వారి హృదయాలపై కఠినావస్థను కలుగజేయి, ఎందుకంటే వారు కఠిన శిక్షను చూసేంతవరకు విశ్వసించరు

Verse 89 — Surah Yunus 10:89

(అల్లాహ్) సెలవిచ్చాడు: "మీ ఉభయుల ప్రార్థన అంగీకరించబడింది. మీరిద్దరూ (ఋజుమార్గంపై) స్థిరంగా ఉండండి. మీరిద్దరూ తెలివి లేని వారి మార్గాన్ని అనుసరించకండి

Verse 90 — Surah Yunus 10:90

మరియు మేము ఇస్రాయీల్ సంతతి వారిని సముద్రం దాటించాము. ఆ పిదప ఫిర్ఔన్ మరియు అతని సైనికులు దౌర్జన్యంతో మరియు శతృత్వంతో వారిని వెంబడించారు. చివరకు (ఫిర్ఔన్) మునిగిపోతూ అన్నాడు: "నిశ్చయంగా, ఇస్రాయీల్ సంతతివారు విశ్వసించిన దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నేను విశ్వసించాను. నేను విధేయులలో (ముస్లింలలో) చేరాను

Verse 91 — Surah Yunus 10:91

(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఇప్పుడా, (నీవు విశ్వసించేది? మరియు వాస్తవానికి నీవు, ఇంత వరకు ఆజ్ఞోల్లంఘన చేస్తూ ఉన్నావు మరియు దౌర్జన్యపరులలో చేరి ఉన్నావు కదా)

Verse 92 — Surah Yunus 10:92

ఇక నీ తరువాత వచ్చేవారికి ఒక సూచనగా ఉండటానికి ఈనాడు నీ శవాన్ని కాపాడతాము." మరియు నిశ్చయంగా, చాలా మంది ప్రజలు మా సూచనల పట్ల నిర్లక్ష్యులై ఉన్నారు

Verse 93 — Surah Yunus 10:93

మరియు వాస్తవానికి మేము ఇస్రాయీల్ సంతతి వారికి ఉండటానికి మంచి స్థానాన్ని ఇచ్చి, వారికి ఉత్తమ జీవనోపాధిని ప్రసాదించాము. మరియు వారి వద్దకు దివ్యజ్ఞానం వచ్చినంత వరకు వారి మధ్య భేదాభిప్రాయాలు రాలేదు. నిశ్చయంగా, నీ ప్రభువు పునరుత్థాన దినమున వారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలను గురించి తీర్పు చేస్తాడు

Verse 94 — Surah Yunus 10:94

(ఓ ముహమ్మద్) ఒకవేళ నీ వైపునకు అవతరింప జేయబడిన విషయాలను గురించి నీకేమైనా సందేహముంటే నీకు పూర్వం వచ్చిన గ్రంథాన్ని చదువు తున్న వారిని అడుగు! వాస్తవంగా, నీ ప్రభువు తరఫు నుండి నీ వద్దకు సత్యం వచ్చింది. కావున నీవు సందేహించే వారిలో చేరకు

Verse 95 — Surah Yunus 10:95

మరియు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారిలో చేరకు. అలా చేస్తే నీవు కూడా తప్పక నష్టం పొందే వారిలో చేరి పోతావు

Verse 96 — Surah Yunus 10:96

నిశ్చయంగా, ఎవరి విషయంలోనైతే నీ ప్రభువు వాక్కు సత్యమని నిరూపించబడిందో, వారు ఎన్నటికీ విశ్వసించరు

Verse 97 — Surah Yunus 10:97

మరియు ఒకవేళ వారి వద్దకు ఏ విధమైన అద్భుత సూచన వచ్చినా! వారు బాధాకరమైన శిక్షను చూడనంత వరకు (విశ్వసించరు)

Verse 98 — Surah Yunus 10:98

యూనుస్ జాతివారు తప్ప! ఇతర ఏ పురవాసులకు కూడా, (శిక్షను చూసిన తరువాత) విశ్వసించగా, వారి విశ్వాసం వారికి లాభదాయకం కాలేక పోయింది! (యూనుస్ జాతి) వారు విశ్వసించిన పిదప మేము వారి నుండి ఇహలోక జీవితపు అవమానకరమైన శిక్షను తొలగించాము. మరియు వారిని కొంతకాలం వరకు వారికి (ఇహలోక జీవితాన్ని) అనుభవించే అవకాశాన్ని ఇచ్చాము

Verse 99 — Surah Yunus 10:99

మరియు నీ ప్రభువు కోరితే, భూమిలో ఉన్న వారందరూ విశ్వసించేవారు. ఏమీ? నీవు మానవులందరినీ విశ్వాసులయ్యే వరకు, వారిని బలవంతం చేస్తూ ఉంటావా

Verse 100 — Surah Yunus 10:100

మరియు ఏ వ్యక్తి అయినా సరే అల్లాహ్ అనుమతి లేనిదే విశ్వసించ జాలడు. జ్ఞానాన్ని ఉపయోగించని వారిపై ఆయన (ఆవిశ్వాసపు) మాలిన్యాన్ని రుద్దుతాడు

Verse 101 — Surah Yunus 10:101

ఇలా అను: "ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ, ఏమేమున్నాయో చూడండి!" మరియు విశ్వసించని ప్రజలకు సూచనలు గానీ, హెచ్చరికలు గానీ ఏ విధంగానూ పనికి రావు

Verse 102 — Surah Yunus 10:102

ఇప్పుడు వారు, తమకు పూర్వం గతించిన వారికి సంభవించిన దినాల కోసం తప్ప మరి దేని కోసం నిరీక్షిస్తున్నారు? వారితో అను: "మీరూ నిరీక్షించండి! నిశ్చయంగా, నేను కూడా మీతో పాటే నిరీక్షిస్తాను

Verse 103 — Surah Yunus 10:103

తరువాత (చివరకు) మేము మా ప్రవక్తలను మరియు విశ్వసించిన వారిని కాపాడుతూ ఉంటాము. ఈ విధంగా విశ్వాసులను కాపాడటం మా విధి

Verse 104 — Surah Yunus 10:104

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మానవులారా! నా ధర్మాన్ని గురించి మీకు ఎలాంటి సందేహం ఉన్నా అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వారిని నేనెన్నడూ ఆరాధించను. అంతేకాదు, నేను అల్లాహ్ నే ఆరాధిస్తాను. ఆయనే మిమ్మల్ని మరణింపజేస్తాడు. మరియు నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని ఆదేశించబడ్డాను

Verse 105 — Surah Yunus 10:105

(నేను ఇలా ఆజ్ఞాపించబడ్డాను): "నీవు మాత్రం సత్యధర్మమైన ఏకదైవ సిద్ధాంతాన్నే అనుసరించు. మరియు ఎన్నటికీ అల్లాహ్ కు సాటి కల్పించేవారిలో (షిర్క్ చేసేవారిలో) చేరకు

Verse 106 — Surah Yunus 10:106

మరియు అల్లాహ్ ను వదలి నీకు లాభంగానీ మరియు నష్టం గానీ కలిగించలేని దానిని నీవు ప్రార్థించకు. ఒకవేళ నీవు అలా చేస్తే! నిశ్చయంగా, నీవు దుర్మార్గులలో చేరిన వాడవుతాడు

Verse 107 — Surah Yunus 10:107

ఒకవేళ అల్లాహ్ నీకు ఏదైనా ఆపద కలిగించదలిస్తే ఆయన తప్ప మరెవ్వరూ దానిని తొలగించలేరు. మరియు ఆయన నీకు మేలు చేయదలిస్తే, ఆయన అనుగ్రహాన్ని ఎవ్వడూ మళ్ళించలేడు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మరియు ఆయనే క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

Verse 108 — Surah Yunus 10:108

(ఓ ప్రవక్తా!) ఇలా అను: "ఓ మానవులారా! వాస్తవంగా, మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు సత్యం వచ్చి ఉన్నది. ఇక ఎవడు సన్మార్గాన్ని అనుసరిస్తాడో! నిశ్చయంగా, అతడు తన మేలుకే సన్మార్గాన్ని అనుసరిస్తాడు. ఇక ఎవడు మార్గభ్రష్టుడవుతాడో నిశ్చయంగా, తనకే నష్టం కలిగించు కుంటాడు. నేను మీ బాధ్యత వహించేవాడను కాను

Verse 109 — Surah Yunus 10:109

మరియు (ఓ ప్రవక్తా!) నీపై అవతరింప జేయబడిన సందేశాన్ని (వహీని) అనుసరించు. మరియు అల్లాహ్ తీర్పు చేసే వరకు నీవు ఓర్పు వహించు. మరియు న్యాయాధిపతులలో ఆయనే అత్యుత్తముడు