Back to Languages

Telugu - Chapter 19 - Maryam

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Maryam 19:1

కాఫ్ - హా - యా - ఐన్ - సాద్

Verse 2 — Surah Maryam 19:2

ఇది నీ ప్రభువు తన దాసుడు జకరియ్యాపై చూపిన కారుణ్య ప్రస్తావన

Verse 3 — Surah Maryam 19:3

అతను తన ప్రభువును రహస్యంగా (ఏకాంతంలో) మొరపెట్టుకుంటూ

Verse 4 — Surah Maryam 19:4

ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నా ఎముకలు బలహీనమై పోయాయి మరియు నా తల (వెంట్రుకలు) ముసలితనం వల్ల తెల్లబడి మెరిసిపోతున్నాయి మరియు ఓ నా ప్రభూ! నిన్ను వేడుకొని నేను ఎన్నడూ నిష్పలుడను కాలేదు

Verse 5 — Surah Maryam 19:5

మరియు వాస్తవానికి నా తరువాత నా బంధువులు (ఏమి చేస్తారో అని) నేను భయ పడుతున్నాను. నా భార్యనేమో గొడ్రాలు. కావున (నీ అనుగ్రహంతో) నాకు ఒక వారసుణ్ణి ప్రసాదించు

Verse 6 — Surah Maryam 19:6

అతడు నాకు మరియు యఅఖూబ్ సంతతి వారికి వారసుడవుతాడు మరియు ఓ నా ప్రభూ! అతనిని నీకు ప్రీతిపాత్రునిగా చేసుకో

Verse 7 — Surah Maryam 19:7

(అతనికి ఇలా జవాబివ్వబడింది): "ఓ జకరియ్యా! నిశ్చయంగా, మేము నీకు 'యహ్యా' అనే పేరు గల ఒక కుమారుని శుభవార్తను ఇస్తున్నాము! ఇంతకు పూర్వం మేము ఈ పేరు ఎవ్వరికీ ఇవ్వలేదు

Verse 8 — Surah Maryam 19:8

(జకరియ్యా) అన్నాడు: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? నా భార్యనేమో గొడ్రాలు, మరియు నేనేమో వృద్ధాప్యంతో క్షీణించి (దుర్భలుడనై) పోయాను

Verse 9 — Surah Maryam 19:9

ఇలా జవాబిచ్చాడు: "అలాగే అవుతుంది. నీ ప్రభువు ఇలా అంటున్నాడు: 'ఇది నాకు సులభం మరియు వాస్తవానికి ఇంతకు ముందు నీవు ఏమీ లేనప్పుడు, నేను నిన్ను సృష్టించాను కదా

Verse 10 — Surah Maryam 19:10

(జకరియ్యా) అన్నాడు: " ఓ నా ప్రభూ! నాకొక గుర్తును నియమించు." ఇలా జవాబు ఇవ్వబడింది: "నీ గుర్తు ఏమిటంటే! నీవు స్వస్థతతో ఉండి కూడా వరుసగా మూడు రాత్రులు (దినములు) ప్రజలతో మాట్లాడలేవు

Verse 11 — Surah Maryam 19:11

ఆ పిదప అతను (జకరియ్యా) తన ప్రార్థనాలయం నుండి బయటికి వచ్చి తన జాతి వారికి, సైగలతో ఉదయమూ మరియు సాయంత్రమూ, ఆయన (ప్రభువు) పవిత్రతను కొనియాడండని సూచించాడు

Verse 12 — Surah Maryam 19:12

(అతని కుమారునితో ఇలా అనబడింది): "ఓ యహ్యా! ఈ దివ్యగ్రంథాన్ని గట్టిగా పట్టుకో." మరియు మేము అతనికి బాల్యంలోనే వివేకాన్ని ప్రసాదించాము

Verse 13 — Surah Maryam 19:13

మరియు మా తరఫు నుండి కనికరాన్ని, పరిశుద్ధతను ఒనంగాము మరియు అతను దైవభీతి గలవాడు

Verse 14 — Surah Maryam 19:14

మరియు తన తల్లిదండ్రుల పట్ల కర్తవ్యపాలకుడు మరియు అతను హింసాపరుడు గానీ, అవిధేయుడు గానీ కాడు

Verse 15 — Surah Maryam 19:15

మరియు అతను పుట్టినరోజూ మరియు అతను మరణించే రోజూ మరియు అతను బ్రతికించి మరల లేపబడే రోజూ అతనికి శాంతి కలుగు గాక

Verse 16 — Surah Maryam 19:16

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్ లో) ఉన్న మర్యమ్ (గాథను) ప్రస్తావించు. ఆమె తన కుటుంబం వారిని విడిచి తూర్పుదిశలో ఒక స్థలానికి వెళ్ళిపోయింది

Verse 17 — Surah Maryam 19:17

అక్కడ ఆమె వారి నుండి ఏకాంతంలో ఒక అడ్డుతెర కట్టుకొని ఉండసాగింది. అప్పుడు మేము ఆమె వద్దకు మా దూత (జిబ్బీల్)ను పంపాము. అతను ఆమె ముందు సంపూర్ణ మానవ ఆకారంలో (రూపంలో) ప్రత్యక్షమయ్యాడు

Verse 18 — Surah Maryam 19:18

(మర్యమ్) ఇలా అన్నది: "ఒకవేళ నీవు దైవభీతి గల వాడవే అయితే! నిశ్చయంగా నేను నీ నుండి (రక్షింపబడటానికి) అనంత కరుణామయుని శరణు వేడుకుంటున్నాను

Verse 19 — Surah Maryam 19:19

(దేవదూత ఇలా) జవాబిచ్చాడు: "నిశ్చయంగా, నేను నీ ప్రభువు యొక్క సందేశహరుడను! నీకు ఒక సుశీలుడైన (నీతిమంతుడైన) కుమారుని (సందేశాన్ని) ఇవ్వటానికి పంపబడ్డాను

Verse 20 — Surah Maryam 19:20

ఆమె ఇలా ప్రశ్నించింది: "నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? నన్ను ఏ మానవుడునూ ముట్టుకోలేదే! మరియు నేను చెడు నడవడిక గల దానిని కూడా కాను

Verse 21 — Surah Maryam 19:21

అతనన్నాడు: "అలాగే అవుతుంది! నీ ప్రభువు అంటున్నాడు: 'అది నాకు సులభం! మేము అతనిని, మా నుండి ప్రజలకు ఒక సూచనగా మరియు కారుణ్యంగా పంపుతున్నాము.' మరియు (నీ ప్రభువు) ఆజ్ఞ నెరవేరి తీరుతుంది

Verse 22 — Surah Maryam 19:22

తరువాత మర్యమ్ ఆ బాలుణ్ణి గర్భంలో భరించి, అతనితో ఒక దూరమైన స్థలానికి వెళ్ళిపోయింది

Verse 23 — Surah Maryam 19:23

ఆ తరువాత ప్రసవ వేదనతో ఆమె ఒక ఖర్జూరపు చెట్టు మొదలు దగ్గరికి చేరుకొని ఇలా వాపోయింది: "అయ్యో! నా దౌర్భాగ్యం, దీనికి ముందే నేను చనిపోయి వుంటే! మరియు నామరూపాలు లేకుండా నశించి పోతే ఎంత బాగుండేది

Verse 24 — Surah Maryam 19:24

అప్పుడు క్రింది నుండి ఒక ధ్వని వినిపించింది: "నీవు దుఃఖించకు! వాస్తవాంగా నీ ప్రభువు, నీ క్రింద (దగ్గరగా) ఒక సెలయేరు సృష్టించాడు

Verse 25 — Surah Maryam 19:25

మరియు నీవు ఈ చెట్టు మొదలు పట్టి ఊపితే నీపై తాజా ఖర్జూరపు పండ్లు రాలుతాయి

Verse 26 — Surah Maryam 19:26

కావున నీవు తిను త్రాగు, నీ కళ్ళను చల్లబరచుకో! ఇక ఏ మానవుణ్ణి చూసినా అతనితో (సైగలతో): 'నేను నా కరుణామయుని కొరకు ఉపవాసమున్నాను, కావున ఈ రోజు నేను ఏ మానవునితో మాట్లాడను.' అని చెప్పు

Verse 27 — Surah Maryam 19:27

తరువాత ఆమె ఆ బాలుణ్ణి తీసుకొని తన జాతి వారి వద్దకు రాగా! వారన్నారు: "ఓ మర్యమ్! వాస్తవానికి నీవు నింద్యమైన (పాపమైన) పని చేశావు

Verse 28 — Surah Maryam 19:28

ఓ హారూన్ సోదరీ! నీ తండ్రీ చెడ్డవాడు కాదు మరియు నీ తల్లి కూడా చెడు నడత గలది కాదే

Verse 29 — Surah Maryam 19:29

అప్పుడామె అతని (ఆ బాలుని) వైపు సైగ చేసింది. వారన్నారు: "తొట్టెలో వున్న ఈ బాలునితో మేమెలా మాట్లాడగలము

Verse 30 — Surah Maryam 19:30

(ఆ బాలుడు) అన్నాడు: "నిశ్చయంగా నేను అల్లాహ్ దాసుణ్ణి. ఆయన నాకు దివ్యగ్రంథాన్నిచ్చి, నన్ను ప్రవక్తగా నియమించాడు

Verse 31 — Surah Maryam 19:31

మరియు నేనెక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు; నేను బ్రతికి వున్నంత కాలం నమాజ్ చేయమని మరియు విధిదానం (జకాత్) ఇవ్వమని నన్ను ఆదేశించాడు

Verse 32 — Surah Maryam 19:32

మరియు నన్ను నా తల్లి యెడల కర్తవ్యపాలకునిగా చేశాడు. నన్ను దౌర్జన్యపరునిగా, దౌర్భాగ్యునిగా చేయలేదు

Verse 33 — Surah Maryam 19:33

మరియు నేను పుట్టినరోజూ మరియు నేను మరణించే రోజూ మరియు నేను సజీవుడనై మరల లేచే రోజూ, నాకు శాంతి కలుగు గాక

Verse 34 — Surah Maryam 19:34

ఇతనే మర్యమ్ కుమారుడు ఈసా! ఇదే సత్యమైన మాట, దీనిని గురించే వారు వాదులాడుతున్నారు (సందేహంలో పడి ఉన్నారు)

Verse 35 — Surah Maryam 19:35

ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అల్లాహ్ కు తగినపని కాదు. ఆయన సర్వలోపాలకు అతీతుడు, ఆయన ఏదైనా చేయదలుచు కుంటే, దానిని కేవలం: "అయిపో!" అని అంటాడు, అంతే అది అయిపోతుంది

Verse 36 — Surah Maryam 19:36

(ఈసా అన్నాడు): "నిశ్చయంగా అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గము

Verse 37 — Surah Maryam 19:37

తరువాత విభిన్న (క్రైస్తవ) వర్గాల వారు (ఈసాను గురించి) పరస్పర అభిప్రాయభేదాలు నెలకొల్పుకున్నారు. కావున ఈ సత్యతిరస్కారులకు ఆ మహా దినపు దర్శనం వినాశాత్మకంగా ఉంటుంది

Verse 38 — Surah Maryam 19:38

వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు బాగానే వింటాయి మరియు వారి కండ్లు బాగానే చూస్తాయి. కాని ఈనాడు ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు

Verse 39 — Surah Maryam 19:39

మరియు వారిని (రాబోయే) ఆ పశ్చాత్తాప పడవలసిన దినాన్ని గురించి హెచ్చరించు. అప్పుడు పరిణామం నిర్ణయించ బడి ఉంటుంది. (ఇప్పుడైతే) వారు ఏమరుపాటులో పడి ఉన్నారు, కావున వారు విశ్వసించడం లేదు

Verse 40 — Surah Maryam 19:40

నిశ్చయంగా! భూమికి మరియు దానిపై వున్న వారికి వారసులం మేమే! వారందరూ మా వైపునకే మరలింపబడతారు

Verse 41 — Surah Maryam 19:41

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్ లో) వున్న ఇబ్రాహీమ్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను సత్యవంతుడైన దైవప్రవక్త

Verse 42 — Surah Maryam 19:42

అతను తన తండ్రితో ఇలా అన్నప్పుడు: "ఓ నాన్నా! వినలేని మరియు చూడలేని మరియు నీకు ఏ విధంగానూ సహాయపడలేని వాటిని, నీవెందుకు ఆరాధిస్తున్నావు

Verse 43 — Surah Maryam 19:43

ఓ నాన్నా! వాస్తవానికి, నా వద్దకు వచ్చిన జ్ఞానం నీ వద్దకు రాలేదు, కావున నీవు నన్ను అనుసరిస్తే, నేను నీకు సరైన మార్గం చూపుతాను

Verse 44 — Surah Maryam 19:44

ఓ నాన్నా! నీవు షైతాన్ ను ఆరాధించకు, నిశ్చయంగా షైతాన్ అనంత కరుణామయుణ్ణి ఉల్లంఘించాడు

Verse 45 — Surah Maryam 19:45

ఓ నాన్నా! నిశ్చయంగా, నీవు అనంత కరుణామయుని శిక్షకు గురి అయ్యి, షైతాను యొక్క స్నేహితుడవు / సహచరుడవు (వలి) అయి పోతావేమోనని నేను భయపడుతున్నాను

Verse 46 — Surah Maryam 19:46

(అతని తండ్రి) అన్నాడు: "ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవు నా దేవుళ్ళకు విముఖత చూపుతున్నావా? ఒకవేళ నీవిది మానుకోక పోతే నేను నిన్ను రాళ్ళు రువ్వి చంపిస్తాను. కావున నీవు నా నుండి చాలా దూరమై పో

Verse 47 — Surah Maryam 19:47

(ఇబ్రాహీమ్) అన్నాడు: "నీకు సలాం! నీ కొరకు నా ప్రభువు క్షమాపణను వేడుకుంటాను. నిశ్చయంగా, ఆయన నా యెడల ఎంతో దయాళువు

Verse 48 — Surah Maryam 19:48

మరియు నేను మిమ్మల్ని - మరియు అల్లాహ్ కు బదులుగా మీరు ప్రార్థిస్తున్న వాటిని - అందరినీ వదలి పోతున్నాను. మరియు నేను నా ప్రభువును ప్రార్థిస్తాను. నేను నా ప్రభువును ప్రార్థించి విఫలుడను కానని, నమ్ముతున్నాను

Verse 49 — Surah Maryam 19:49

అతను (ఇబ్రాహీమ్) వారిని - మరియు అల్లాహ్ ను వదలి వారు ఆరాధించే వాటిని - వదలి పోయిన తరువాత మేము అతనికి ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను ప్రసాదించాము. మరియు ప్రతి ఒక్కరినీ ప్రవక్తలుగా చేశాము

Verse 50 — Surah Maryam 19:50

మరియు వారికి మా కారుణ్యాన్ని ప్రసాదించాము. వారికి నిజమైన, ఉన్నతమైన కీర్తి ప్రతిష్ఠను కలుగజేశాము

Verse 51 — Surah Maryam 19:51

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్) లో వచ్చిన మూసా గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను (అల్లాహ్) ఎన్నుకున్న ఒక సందేశహరుడు మరియు ఒక ప్రవక్త

Verse 52 — Surah Maryam 19:52

మరియు మేము తూర్ కొండ కుడివైపు నుండి అతనిని (మూసాను) పిలిచి, అతనితో ఏకాంతంలో మాట్లాడటానికి మమ్మల్ని సమీపింపజేశాము

Verse 53 — Surah Maryam 19:53

మరియు మా కారుణ్యంతో, అతనికి తోడుగా అతని సోదరుడైన, హారూన్ ను కూడా ప్రవక్తగా నియమించాము

Verse 54 — Surah Maryam 19:54

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్) లో వచ్చిన ఇస్మాయీల్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను వాగ్దానాలను సత్యం చేసే (నెరవేర్చే) వాడు మరియు ఒక సందేశహరుడు మరియు ఒక ప్రవక్త

Verse 55 — Surah Maryam 19:55

మరియు అతను తన కుటుంబం వారిని నమాజ్ మరియు విధిదానం (జకాత్) లను పాటించమని ఆజ్ఞాపించేవాడు. మరియు తన ప్రభువుకు ప్రీతిపాత్రుడుగా ఉండేవాడు

Verse 56 — Surah Maryam 19:56

మరియు ఈ గ్రంథం (ఖుర్ఆన్)లో వచ్చిన ఇద్రీస్ గాథను ప్రస్తావించు. నిశ్చయంగా, అతను సత్యవంతుడైన ప్రవక్త

Verse 57 — Surah Maryam 19:57

మరియు మేము అతనిని ఉన్నత స్థానానికి ఎత్తాము

Verse 58 — Surah Maryam 19:58

వారందరూ, అల్లాహ్ అనుగ్రహించిన ఆదమ్ సంతతి వారిలోని దైవప్రవక్తలలో కొందరు. మరియు వారిలో కొందరు మేము నూహ్ ఓడలో ఎక్కింపజేసిన వారు, మరికొందరు ఇబ్రాహీమ్ మరియు ఇస్రాయీల్ (యఅఖూబ్) సంతానానికి చెందిన వారున్నారు. మరియు వారిలో మేము ఎన్నుకొని సన్మార్గం చూపిన వారున్నారు. ఒకవేళ వారికి కరుణామయుని సూచనలు (ఆయాత్) చదివి వినిపించినప్పుడు, వారు విలపిస్తూ సాష్టాంగం (సజ్దా)లో పడిపోయేవారు

Verse 59 — Surah Maryam 19:59

కాని వారి తరువాత వచ్చిన, వారి సంతతి వారు కొందరు, నమాజ్ లను విడిచి పెట్టి తమ (దుష్ట) మనోవాంఛలను అనుసరించారు. కావున త్వరలోనే వారు అధోగతి (నరకంలో)కి చేరగలరు

Verse 60 — Surah Maryam 19:60

కాని ఎవరైతే, పశ్చాత్తాప పడి మరియు విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు

Verse 61 — Surah Maryam 19:61

అనంత కరుణామయుడు, తన దాసులకు వాగ్దానం చేసిన అగోచర జగత్తులోని శాశ్వతమైన స్వర్గవనాలు. నిశ్చయంగా ఆయన వాగ్దానం పూర్తయి తీరుతుంది

Verse 62 — Surah Maryam 19:62

వారందులో మీకు శాంతి కలుగు గాక (సలాం!) అనడం తప్ప ఇతర ఏ విధమైన వ్యర్థపు మాటలు వినరు. మరియు అందులో వారికి ఉదయం మరియు సాయంత్రం జీవనోపాధి లభిస్తూ ఉంటుంది

Verse 63 — Surah Maryam 19:63

మా దాసులలో దైవభీతి గలవారిని వారసులుగా చేసే స్వర్గం ఇదే

Verse 64 — Surah Maryam 19:64

(దేవదూతలు అంటారు): "మరియు మేము కేవలం నీ ప్రభువు ఆజ్ఞతో తప్ప క్రిందికి దిగిరాము. మా ముందున్నది, మా వెనుక నున్నది మరియు వాటి మధ్య నున్నదీ, సర్వం ఆయనకు చెందినదే! నీ ప్రభువు మరచి పోయేవాడు కాడు

Verse 65 — Surah Maryam 19:65

ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధనలోనే స్థిరంగా వుండండి. ఆయనతో సమానమైన స్థాయిగల వానిని ఎవడినైనా మీరెరుగుదురా

Verse 66 — Surah Maryam 19:66

మరియు మానవుడు ఇలా అంటూ ఉంటాడు: "ఏమీ? నేను చనిపోయిన తరువాత మళ్ళీ బ్రతికించబడి లేపబడతానా

Verse 67 — Surah Maryam 19:67

ఏమీ? మునుపు, అతడి ఉనికే లేనప్పుడు, మేము అతనిని సృష్టించిన విషయం అతనికి జ్ఞాపకం రావటం లేదా

Verse 68 — Surah Maryam 19:68

కావున నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ మరియు (వారితో పాటు) షైతానులను కూడా ప్రోగు చేసి, ఆ తరువాత నిశ్చయంగా, వారందరినీ నరకం చుట్టూ మోకాళ్ల మీద సమావేశ పరుస్తాము

Verse 69 — Surah Maryam 19:69

ఆ తరువాత నిశ్చయంగా, ప్రతి తెగ వారిలో నుండి అనంత కరుణామయునికి ఎవరు ఎక్కువ అవిధేయులుగా ఉండేవారో, వారిని వేరు చేస్తాము

Verse 70 — Surah Maryam 19:70

అప్పుడు వారిలో (నరకాగ్నిలో) కాలటానికి ఎక్కువ అర్హులెవరో, మాకు బాగా తెలుసు

Verse 71 — Surah Maryam 19:71

మరియు మీలో ఎవ్వడునూ దాని (నరకంపై గల వంతెన) మీద నుండి పోకుండా (దాటకుండా) ఉండలేడు. ఇది తప్పించుకోలేని, నీ ప్రభువు యొక్క నిర్ణయం

Verse 72 — Surah Maryam 19:72

ఆ పిదప మేము దైవభీతి గలవారిని రక్షిస్తాము. మరియు దుర్మార్గులను అందులో మోకాళ్ళ మీద పడి ఉండటానికి వదులుతాము

Verse 73 — Surah Maryam 19:73

మరియు స్పష్టమైన మా సూచనలను వారికి చదివి వినిపించినపుడు, సత్యతిరస్కారులు విశ్వాసులతో అంటారు: "మన రెండు వర్గాల వారిలో ఎవరి వర్గం మంచి స్థితిలో ఉంది మరియు ఎవరి సభ ఉత్తమమైనది

Verse 74 — Surah Maryam 19:74

మరియు వారికి ముందు మేము ఎన్నో తరాలను (వంశాలను) నాశనం చేశాము; వారు వీరి కంటే ఎక్కువ సిరిసంపదలు మరియు బాహ్య ఆడంబరాలు గలవారై ఉండిరి

Verse 75 — Surah Maryam 19:75

వారితో అను: "మార్గభ్రష్టత్వంలో పడి వున్నవానికి, అనంత కరుణామయుడు, ఒక సమయం వరకు వ్యవధి నిస్తూ ఉంటాడు. తుదకు వారు తమకు వాగ్దానం చేయబడిన దానిని చూసినపుడు, అది (కఠినమైన) శిక్షనో కావచ్చు లేదా అంతిమ ఘడియనో కావచ్చు! హీనస్థితిలో ఉన్న వాడెవడో మరియు బలహీన వర్గం (సేన) ఎవరిదో వారికి తెలియగలదు

Verse 76 — Surah Maryam 19:76

మరియు (దానికి ప్రతిగా) మార్గదర్శకత్వం పొందిన వారికి, అల్లాహ్ మార్గదర్శత్వంలో వృద్ధిని ప్రసాదిస్తాడు. చిరస్థాయిగా ఉండిపోయే సత్కార్యాలే, "నీ ప్రభువు దగ్గర ప్రతిఫలం రీత్యా ఉత్తమమైనవి మరియు పర్యవసానం దృష్ట్యా కూడా ఉత్తమమైనవి

Verse 77 — Surah Maryam 19:77

ఏమీ? మా సూచనలను తిరస్కరించి: "నిశ్చయంగా, నాకు ధనసంపదలూ మరియు సంతానం ఇవ్వబడుతూనే ఉంటాయి." అని పలికే వానిని నీవు చూశావా

Verse 78 — Surah Maryam 19:78

ఏమీ? అతడు అగోచరాన్ని చూశాడా? లేదా అనంత కరుణామయుని వాగ్దానం పొందాడా

Verse 79 — Surah Maryam 19:79

అలా కాదు! అతడు చెప్పేది, మేము వ్రాసి పెట్టగలము. మరియు అతడి శిక్షను మరింత పెంచగలము

Verse 80 — Surah Maryam 19:80

మరియు అతడు చెప్పే వస్తువులకు మేమే వారసులమవుతాము మరియు అతడు ఒంటరిగానే మా వద్దకు వస్తాడు

Verse 81 — Surah Maryam 19:81

మరియు వారు అల్లాహ్ ను వదిలి ఇతరులను ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారు, వారు వీరికి అండగా ఉంటారనుకొని

Verse 82 — Surah Maryam 19:82

అలా కాదు! వారు (ఆ దైవాలు) వీరి ఆరాధనను నిరాకరించటమే గాక, వీరికి విరోధులుగా ఉంటారు

Verse 83 — Surah Maryam 19:83

ఏమీ? నీకు తెలియదా? నిశ్చయంగా మేము సత్యతిరస్కారులపై షైతానులను వదిలామని? అవి వారిని (సత్యాన్ని తిరస్కరించమని) అత్యధికంగా ప్రేరేపిస్తూ ఉంటాయని

Verse 84 — Surah Maryam 19:84

కావున వారి మీద (శిక్షను) అవతరింప జేయమని నీవు తొందర పెట్టకు. నిశ్చయంగా, మేము (వారి దినాలను) ఖచ్చితంగా లెక్క పెడుతున్నాము

Verse 85 — Surah Maryam 19:85

ఆ రోజు మేము దైవభీతి గలవారిని అనంత కరుణామయుని సన్నిధిలో అతిథులుగా ప్రవేశపెడతాము

Verse 86 — Surah Maryam 19:86

మరియు అపరాధులను దప్పిక గొన్న వాటి వలే (జంతువుల వలే), నరకం వైపునకు తోలుకొని పోతాము

Verse 87 — Surah Maryam 19:87

(ఆనాడు) అనంత కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప మరెవ్వరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు

Verse 88 — Surah Maryam 19:88

వారిలా అన్నారు: "అనంతకరుణామయునికి కొడుకున్నాడు

Verse 89 — Surah Maryam 19:89

వాస్తవానికి, మీరు ఎంత పాపిష్ఠికరమైన విషయాన్ని కల్పించారు

Verse 90 — Surah Maryam 19:90

దాని వలన ఆకాశాలు ప్రేలి పోవచ్చు! భూమి చీలి పోవచ్చు! మరియు పర్వతాలు ధ్వంసమై పోవచ్చు

Verse 91 — Surah Maryam 19:91

ఎందుకంటే వారు అనంత కరుణామయునికి కొడుకున్నాడని ఆరోపించారు

Verse 92 — Surah Maryam 19:92

ఎవరినైనా కొడుకునిగా చేసుకోవటం అనంత కరుణామయునికి తగినది కాదు

Verse 93 — Surah Maryam 19:93

ఎందుకంటే! భూమ్యాకాశాలలో నున్న వారందరూ కేవలం అనంత కరుణామయుని దాసులుగా మాత్రమే హాజరు కానున్నారు

Verse 94 — Surah Maryam 19:94

వాస్తవానికి, ఆయన అందరినీ పరివేష్టించి ఉన్నాడు మరియు వారిని సరిగ్గా లెక్క పెట్టి ఉన్నాడు

Verse 95 — Surah Maryam 19:95

మరియు పునరుత్థాన దినమున వారందరూ, ఒంటరిగానే ఆయన ముందు హాజరవుతారు

Verse 96 — Surah Maryam 19:96

నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసే వారి పట్ల అనంత కరుణామయుడు (ప్రజల హృదయాలలో) ప్రేమను (వాత్సల్యాన్ని) కలుగజేయగలడు

Verse 97 — Surah Maryam 19:97

కావున నీవు (ఓ ప్రవక్తా!) దైవభీతి గలవారికి శుభవార్త నివ్వటానికి మరియు వాదులాడే జాతి వారిని హెచ్చరించటానికీ, మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) సులభతరం చేసి, నీ భాషలో అవతరింపజేశాము

Verse 98 — Surah Maryam 19:98

మరియు వీరికి పూర్వం మేము ఎన్ని తరాల వారిని నాశనం చేయలేదు! ఏమీ? నీవు ఇప్పుడు వారిలో ఏ ఒక్కరినైనా చూస్తున్నావా? లేక వారి మెల్లని శబ్దమైనా వింటున్నావా