Back to LanguagesPrevious ChapterNext Chapter
Telugu - Chapter 56 - Al-Waqiah
Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink
Verse 1 — Surah Al-Waqiah 56:1
ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు
Verse 2 — Surah Al-Waqiah 56:2
అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు
Verse 3 — Surah Al-Waqiah 56:3
అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది
Verse 4 — Surah Al-Waqiah 56:4
భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు
Verse 5 — Surah Al-Waqiah 56:5
మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు
Verse 6 — Surah Al-Waqiah 56:6
అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు
Verse 7 — Surah Al-Waqiah 56:7
మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు
Verse 8 — Surah Al-Waqiah 56:8
ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)
Verse 9 — Surah Al-Waqiah 56:9
మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)
Verse 10 — Surah Al-Waqiah 56:10
మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు
Verse 11 — Surah Al-Waqiah 56:11
అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు
Verse 12 — Surah Al-Waqiah 56:12
వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు
Verse 13 — Surah Al-Waqiah 56:13
మొదటి తరాల వారిలో నుండి చాలా మంది
Verse 14 — Surah Al-Waqiah 56:14
మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది
Verse 15 — Surah Al-Waqiah 56:15
(బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద
Verse 16 — Surah Al-Waqiah 56:16
ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు
Verse 17 — Surah Al-Waqiah 56:17
వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు
Verse 18 — Surah Al-Waqiah 56:18
(మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో
Verse 19 — Surah Al-Waqiah 56:19
దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు
Verse 20 — Surah Al-Waqiah 56:20
మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి
Verse 21 — Surah Al-Waqiah 56:21
మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం
Verse 22 — Surah Al-Waqiah 56:22
మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్)
Verse 23 — Surah Al-Waqiah 56:23
దాచబడిన ముత్యాల వలే
Verse 24 — Surah Al-Waqiah 56:24
ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా
Verse 25 — Surah Al-Waqiah 56:25
అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు
Verse 26 — Surah Al-Waqiah 56:26
శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప
Verse 27 — Surah Al-Waqiah 56:27
మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)
Verse 28 — Surah Al-Waqiah 56:28
వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య
Verse 29 — Surah Al-Waqiah 56:29
మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు
Verse 30 — Surah Al-Waqiah 56:30
మరియు వ్యాపించి ఉన్న నీడలు
Verse 31 — Surah Al-Waqiah 56:31
మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు
Verse 32 — Surah Al-Waqiah 56:32
మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు
Verse 33 — Surah Al-Waqiah 56:33
ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో)
Verse 34 — Surah Al-Waqiah 56:34
మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు
Verse 35 — Surah Al-Waqiah 56:35
నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము
Verse 36 — Surah Al-Waqiah 56:36
మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము
Verse 37 — Surah Al-Waqiah 56:37
వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు)
Verse 38 — Surah Al-Waqiah 56:38
కుడిపక్షం వారి కొరకు
Verse 39 — Surah Al-Waqiah 56:39
అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు
Verse 40 — Surah Al-Waqiah 56:40
మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు
Verse 41 — Surah Al-Waqiah 56:41
ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)
Verse 42 — Surah Al-Waqiah 56:42
వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో
Verse 43 — Surah Al-Waqiah 56:43
మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు)
Verse 44 — Surah Al-Waqiah 56:44
అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు
Verse 45 — Surah Al-Waqiah 56:45
నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి
Verse 46 — Surah Al-Waqiah 56:46
మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి
Verse 47 — Surah Al-Waqiah 56:47
మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా
Verse 48 — Surah Al-Waqiah 56:48
మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా
Verse 49 — Surah Al-Waqiah 56:49
వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ
Verse 50 — Surah Al-Waqiah 56:50
వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు
Verse 51 — Surah Al-Waqiah 56:51
ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా
Verse 52 — Surah Al-Waqiah 56:52
మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు
Verse 53 — Surah Al-Waqiah 56:53
దానితో కడుపులు నింపుకుంటారు
Verse 54 — Surah Al-Waqiah 56:54
తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు
Verse 55 — Surah Al-Waqiah 56:55
వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు
Verse 56 — Surah Al-Waqiah 56:56
తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే
Verse 57 — Surah Al-Waqiah 56:57
మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు
Verse 58 — Surah Al-Waqiah 56:58
ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా
Verse 59 — Surah Al-Waqiah 56:59
ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము
Verse 60 — Surah Al-Waqiah 56:60
మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు
Verse 61 — Surah Al-Waqiah 56:61
మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి
Verse 62 — Surah Al-Waqiah 56:62
మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు
Verse 63 — Surah Al-Waqiah 56:63
మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా
Verse 64 — Surah Al-Waqiah 56:64
మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము
Verse 65 — Surah Al-Waqiah 56:65
మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు
Verse 66 — Surah Al-Waqiah 56:66
(మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము
Verse 67 — Surah Al-Waqiah 56:67
కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని
Verse 68 — Surah Al-Waqiah 56:68
ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా
Verse 69 — Surah Al-Waqiah 56:69
మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము
Verse 70 — Surah Al-Waqiah 56:70
మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు
Verse 71 — Surah Al-Waqiah 56:71
మీరు రాజేసే అగ్నిని గమనించారా
Verse 72 — Surah Al-Waqiah 56:72
దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా
Verse 73 — Surah Al-Waqiah 56:73
మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము
Verse 74 — Surah Al-Waqiah 56:74
కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు
Verse 75 — Surah Al-Waqiah 56:75
ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను
Verse 76 — Surah Al-Waqiah 56:76
మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది
Verse 77 — Surah Al-Waqiah 56:77
నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది
Verse 78 — Surah Al-Waqiah 56:78
సురక్షితమైన గ్రంథంలో ఉన్నది
Verse 79 — Surah Al-Waqiah 56:79
దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు
Verse 80 — Surah Al-Waqiah 56:80
ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది
Verse 81 — Surah Al-Waqiah 56:81
ఏమీ? మీరు ఈ సందేశాన్ని తేలికగా తీసుకుంటున్నారా
Verse 82 — Surah Al-Waqiah 56:82
మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా
Verse 83 — Surah Al-Waqiah 56:83
అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)
Verse 84 — Surah Al-Waqiah 56:84
మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు
Verse 85 — Surah Al-Waqiah 56:85
మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు
Verse 86 — Surah Al-Waqiah 56:86
ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే
Verse 87 — Surah Al-Waqiah 56:87
మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు
Verse 88 — Surah Al-Waqiah 56:88
కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే
Verse 89 — Surah Al-Waqiah 56:89
అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి
Verse 90 — Surah Al-Waqiah 56:90
మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో
Verse 91 — Surah Al-Waqiah 56:91
అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది)
Verse 92 — Surah Al-Waqiah 56:92
మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో
Verse 93 — Surah Al-Waqiah 56:93
అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది
Verse 94 — Surah Al-Waqiah 56:94
మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది
Verse 95 — Surah Al-Waqiah 56:95
నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం
Verse 96 — Surah Al-Waqiah 56:96
కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు