Back to Languages

Telugu - Chapter 67 - Al-Mulk

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Mulk 67:1

ఎవరి చేతిలోనయితే విశ్వసామ్రాజ్యాధిపత్యం ఉందో! ఆయన సర్వశ్రేష్ఠుడు (శుభదాయకుడు) మరియు ఆయన ప్రతిదీ చేయగల సమర్ధుడు

Verse 2 — Surah Al-Mulk 67:2

ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు

Verse 3 — Surah Al-Mulk 67:3

ఆయనే ఒకదానిపై ఒకటి ఏడు ఆకాశాలను సృష్టించాడు. ఆ అనంత కరుణా మయుని సృష్టిలో నీవు ఎలాంటి లోపాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు: "ఏమీ? నీకేమైనా లోపం కనిపిస్తుందా

Verse 4 — Surah Al-Mulk 67:4

ఇంకా, మాటిమాటికీ నీ చూపులు త్రిప్పి చూడు. అది (నీ చూపు) విఫలమై అలిసి సొలిసి తిరిగి నీ వైపుకే వస్తుంది

Verse 5 — Surah Al-Mulk 67:5

మరియు వాస్తవంగా, మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంకరించాము. మరియు వాటిని, షైతాన్ లను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము. మరియు వారి కొరకు (షైతానుల కొరకు) మేము భగభగ మండే అగ్నిజ్వాలల శిక్షను సిద్ధపరచి ఉంచాము

Verse 6 — Surah Al-Mulk 67:6

మరియు తన ప్రభువును (అల్లాహ్ ను) తిరస్కరించే వారికి నరకశిక్ష ఉంది. అది ఎంత చెడ్డ గమ్యస్థానం

Verse 7 — Surah Al-Mulk 67:7

వారు అందులోకి విసిరి వేయ బడినప్పుడు వారు దాని (భయంకరమైన) గర్జనను వింటారు. మరియు అది మరిగి పొంగుతూ ఉంటుంది

Verse 8 — Surah Al-Mulk 67:8

అది దాదాపు ఉద్రేకంగా ప్రేలిపోతూ ఉంటుంది. ప్రతిసారి అందులోకి (పాపుల) గుంపు పడవేయబడి నప్పుడు! దాని కాపలాదారులు వారితో: "ఏమీ? మీ వద్దకు ఏ హెచ్చరిక చేసేవాడు రాలేదు?" అని ప్రశ్నిస్తారు

Verse 9 — Surah Al-Mulk 67:9

వారంటారు: "ఎందుకు రాలేదు! వాస్తవానికి మా వద్దకు హెచ్చరిక చేసేవాడు వచ్చాడు, కాని మేము అతనిని అసత్యుడవని తిరస్కరించాము మరియు అతనితో ఇలా అన్నాము: 'అల్లాహ్ దేనినీ (ఏ దివ్యజ్ఞానాన్ని) అవతరింప జేయలేదు; మీరు కేవలం ఘోర మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు

Verse 10 — Surah Al-Mulk 67:10

ఇంకా వారు ఇలా అంటారు: "ఒకవేళ మేము విని ఉంటే లేదా గ్రహించి ఉంటే, మేము మండే అగ్నిజ్వాలలో పడి వుండే వారితో చేరే వారము కాము కదా

Verse 11 — Surah Al-Mulk 67:11

అప్పుడు వారే స్వయంగా తమ పాపాన్ని ఒప్పుకుంటారు. కావున భగభగమండే అగ్నిజ్వాలలు దూరమై పోవుగాక

Verse 12 — Surah Al-Mulk 67:12

నిశ్చయంగా, ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో! వారికి క్షమాపణ మరియు గొప్ప ప్రతిఫలం ఉంటాయి

Verse 13 — Surah Al-Mulk 67:13

మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే! లేక వాటిని వెల్లడి చేసినా సరే! నిశ్చయంగా, ఆయనకు హృదయాల స్థితి బాగా తెలుసు

Verse 14 — Surah Al-Mulk 67:14

ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు

Verse 15 — Surah Al-Mulk 67:15

భూమిని మీ అధీనంలో ఉంచినవాడు ఆయనే! కావున మీరు దాని దారులలో తిరగండి. మరియు ఆయన ప్రసాదించిన జీవనోపాధిని తినండి, మరియు మీరు ఆయన వైపునకే సజీవులై మరలి పోవలసి ఉంది

Verse 16 — Surah Al-Mulk 67:16

ఏమీ? మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశాలలో ఉన్నవాడు, మిమ్మల్ని భూమిలోకి అణగద్రొక్కడని, ఎప్పుడైతే అది తీవ్రకంపనాలకు గురి అవుతుందో

Verse 17 — Surah Al-Mulk 67:17

లేక ఆకాశాలలో ఉన్నవాడు, మీపైకి రాళ్ళు కురిపించే గాలివాన పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? నా హెచ్చరిక ఎలాంటిదో అప్పుడు మీరు తెలుసుకోగలరు

Verse 18 — Surah Al-Mulk 67:18

మరియు వాస్తవానికి వారికి పూర్వం గతించిన వారు కూడా (ప్రవక్తలను) తిరస్కరించారు. నా పట్టు (శిక్ష) ఎంత తీవ్రంగా ఉండిందో (చూశారా)

Verse 19 — Surah Al-Mulk 67:19

ఏమీ? వారు తమ ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ, ఎగురుతున్నాయో చూడటం లేదా? ఆ అనంత కరుణామయుడు తప్ప మరెవ్వరూ వాటిని అలా నిలిపి ఉంచలేరు కదా! నిశ్చయంగా ఆయన ప్రతి దానినీ చూస్తున్నాడు

Verse 20 — Surah Al-Mulk 67:20

ఏమీ? అనంత కరుణామయుడు తప్ప మీకు సేన వలే అడ్డుగా నిలిచి, మీకు సహాయపడ గల వాడెవడైనా ఉన్నాడా? ఈ సత్యతిరస్కారులు కేవలం మోసంలో పడి వున్నారు

Verse 21 — Surah Al-Mulk 67:21

ఒకవేళ ఆయన మీ జీవనోపాధిని ఆపి వేస్తే, మీకు జీవనోపాధి ఇచ్చేవాడు ఎవడున్నాడు? అయినా వారు తలబిరుసుతనంలో మునిగి (సత్యానికి) దూరమై పోతున్నారు

Verse 22 — Surah Al-Mulk 67:22

ఏమీ? ఎవడైతే తన ముఖం మీద దేవులాడుతూ నడుస్తాడో, అతడు సరైన మార్గం పొందుతాడా? లేక చక్కగా ఋజుమార్గం మీద నడిచేవాడు పొందుతాడా

Verse 23 — Surah Al-Mulk 67:23

వారితో ఇలా అను: "ఆయనే మిమ్మల్ని సృజించాడు. మరియు ఆయనే మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలనూ ఇచ్చాడు. (అయినా) మీరు కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ

Verse 24 — Surah Al-Mulk 67:24

(ఇంకా) ఇలా అను: "ఆయనే మిమ్మల్ని భూమిలో వ్యాపింపజేశాడు మరియు ఆయన వద్దనే మీరంతా సమావేశ పరచబడతారు

Verse 25 — Surah Al-Mulk 67:25

మరియు వారు ఇలా అడుగుతున్నారు: "మీరు సత్యవంతులే అయితే, ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరనున్నది

Verse 26 — Surah Al-Mulk 67:26

వారితో ఇలా అను: "నిశ్చయంగా, దాని జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది. మరియు నేను స్పష్టంగా హెచ్చరిక చేసే వాడిని మాత్రమే

Verse 27 — Surah Al-Mulk 67:27

తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాలు దుఃఖంతో నిండి నల్లబడిపోతాయి. మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు దేనినయితే అడుగుతూ ఉండేవారో అది (ఆ వాగ్దానం) ఇదే

Verse 28 — Surah Al-Mulk 67:28

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించరా? ఒకవేళ అల్లాహ్ నన్ను మరియు నా తోటి వారిని నాశనం చేయనూ వచ్చు! లేదా మమ్మల్ని కరుణించనూ వచ్చు. కాని సత్యతిరస్కారులను బాధాకరమైన శిక్ష నుండి ఎవడు రక్షించగలడు

Verse 29 — Surah Al-Mulk 67:29

వారితో ఇంకా ఇలా అను: "ఆయనే అనంత కరుణామయుడు, మేము ఆయననే విశ్వసించాము మరియు ఆయననే నమ్ముకున్నాము. ఇక ఎవరు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారో త్వరలోనే మీరు తెలుసుకోగలరు

Verse 30 — Surah Al-Mulk 67:30

వారితో ఇలా అను: "ఏమీ? మీరు ఆలోచించరా? ఒకవేళ మీ బావులలోని నీరు, భూమిలోనికి ఇంకి పోతే, ప్రవహించే ఈ నీటి ఊటలను మీ కొరకు ఎవడు బయటికి తేగలడు