(జ్ఞాపకం చేసుకోండి!) మూసా తన ఇంటివారితో: "నిశ్చయంగా నాకు ఒక అగ్ని కనిపిస్తోంది. నేను దాని నుండి మీ వద్దకు ఏదైనా వార్తను తీసుకు వస్తాను లేదా మీరు కాచుకోవడానికి మండే కొరివినైనా తీసుకువస్తాను." అని అన్నాడు
కాని అతడు అక్కడికి చేరినప్పుడు ఒక ధ్వని ఇలా వినిపించింది: "ఈ అగ్నిలో ఉన్న వానికీ మరియు దాని పరిసరాలలో ఉన్నవానికీ శుభాలు కలుగుగాక! సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు
నీ చేతికర్రను పడవేయి!" అతను దానిని (పడవేసి) చూశాడు. అది పామువలే కదలసాగింది. అతడు వెనుదిరిగి చూడకుండా పరుగెత్తసాగాడు. (అల్లాహ్ అన్నాడు): "ఓ మూసా! భయపడకు. నిశ్చయంగా, నా సన్నిధిలో సందేశహరులకు ఎలాంటి భయం ఉండదు
ఇక నీ చేతిని నీ చంకలో (జేబులో) పెట్టి (తీయి), అది ఎలాంటి లోపం లేకుండా తెల్లగా (ప్రకాశిస్తూ) బయటికి వస్తుంది. ఈ తొమ్మిది అద్భుత సూచనలు (ఆయాత్) తీసుకొని నీవు ఫిరఔన్ మరియు అతని జాతి వారి వద్దకు వెళ్ళు. నిశ్చయంగా, వారు అవిధేయులై పోయారు
మరియు వాస్తవంగా, మేము దావూద్ మరియు సులైమాన్ లకు జ్ఞానాన్ని ప్రసాదించాము. వారిద్దరు అన్నారు: "విశ్వాసులైన తన అనేక దాసులలో, మా ఇద్దరికి ఘనతను ప్రసాదించిన ఆ అల్లాహ్ యే సర్వస్తోత్రములకు అర్హుడు
మరియు సులైమాన్, దావూద్ కు వారసుడయ్యాడు. మరియు అతను (సులైమాన్) అన్నాడు: "ఓ ప్రజలారా! మాకు పక్షుల భాష నేర్పబడింది. మరియు మాకు ప్రతి వస్తువు ఒసంగబడింది. నిశ్చయంగా, ఇది ఒక స్పష్టమైన (అల్లాహ్) అనుగ్రహమే
చివరకు వారు చీమల లోయకు (కనుమకు) చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా అన్నది: "ఓ చీమలారా! మీరు మీ ఇండ్లలోకి ప్రవేశించండి, లేకపోతే సులైమాన్ మరియు అతన సైనికులు - వారికి తెలియకుండానే - మిమ్మల్ని నలిపి వేయవచ్చు
(సులైమాన్) దాని మాటలకు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను - నాకూ మరియు నా తల్లిదండ్రులకు చూపిన అనుగ్రహాలకు - కృతజ్ఞత తెలిపేవానిగా మరియు నీకు నచ్చే సత్కార్యాలు చేసేవానిగా, ప్రోత్సాహపరచు. మరియు నన్ను నీ కారుణ్యంతో సద్వర్తనులైన నీ దాసులలో చేర్చుకో
ఆ తరువాత ఎంతో సేపు గడవక ముందే అది వచ్చి ఇలా అన్నది: "నీకు తెలియని విషయమొకటి నేను తెలుసుకొని వచ్చాను. నేను సబాను గురించి ఒక నమ్మకమైన వార్తను నీ కొరకు తెచ్చాను
మరియు నేను ఆమెను మరియు ఆమె జాతివారిని అల్లాహ్ ను వదలి సూర్యునికి సాష్టాంగం (సజ్దా) చేయటం చూశాను మరియు షైతాన్ వారి కర్మలను, వారికి మంచివిగా తోచేటట్లు చేశాడు. కావున వారిని సన్మార్గం నుండి నిరోధించాడు, కాబట్టి వారు సన్మార్గం పొందలేక పోయారు
అందుకే వారు - ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ దాని వున్న వాటిని బయటికి తీసేవాడూ మరియు మీరు దాచే వాటినీ మరియు వ్యక్త పరిచే వాటినీ ఎరుగువాడూ అయిన - అల్లాహ్ కు సాష్టాంగం (సజ్దా) చేయటం లేదు
(రాణి) అన్నది: "రాజులు ఏ దేశంలోనైనా జొరబడినప్పుడు, వారందులో కల్లోలం రేకెత్తిస్తారు మరియు అక్కడి గౌరవనీయులైన ప్రజలను అవమాన పరుస్తారు. వీరు కూడా అదే విధంగా చేయవచ్చు
(రాయబారులు) సులైమాన్ వద్దకు వచ్చినపుడు, అతను అన్నాడు: "ఏమీ? మీరు నాకు ధనసహాయం చేయదలచారా? అల్లాహ్ నాకు ఇచ్చింది, మీకు ఇచ్చిన దాని కంటే ఎంతో ఉత్తమమైనది, ఇక మీ కానుకతో మీరే సంతోషపడండి
(సులైమాన్) అన్నాడు): "నీవు వారి వద్దకు తిరిగిపో, మేము వారిపైకి గొప్ప సేనలతో వస్తాము. వారు వాటిని ఎదిరించజాలరు. మేము వారిని పరాభవించి అచ్చటి నుండి వెడల గొడ్తాము. మరియు వారు అవమానితులై ఉండిపోతారు
జిన్నాతులలో బలిష్ఠుడైన ఒకడు ఇలా అన్నాడు: "నీవు నీ స్థానం నుండి లేవక ముందే నేను దానిని తీసుకువస్తాను. నిశ్చయంగా నేను ఇలా చేసే బలం గలవాడను, నమ్మదగిన వాడను
గ్రంథజ్ఞానం గల ఒకతను ఇలా అన్నాడు: "నేను కనురెప్పపాటు కాలంలో దానిని నీ వద్దకు తేగలను!" ఆ తరువాత (సులైమాన్) దానిని వాస్తవంగా తన ముందు పెట్టబడి ఉండటాన్ని చూసి ఇలా అన్నాడు: "ఇది నా ప్రభువు అనుగ్రహం. నేను కృతజ్ఞతలు చూపుదునా లేక కృతఘ్నుడ నవుదునా అని పరీక్షించటానికి ఇలా చేయబడింది. కృతజ్ఞతలు తెలిపేవాడు, నిశ్చయంగా, తన మేలు కొరకే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. కాని ఎవడైనా కృతఘ్నతకు పాల్పడితే, నిశ్చయంగా, నా ప్రభువు స్వయం సమృద్ధుడు, పరమ దాత (అని తెలుసుకోవాలి)
(సులైమాన్) అన్నాడు: "ఆమె గుర్తించ లేకుండా ఆమె సింహాసనపు రూపాన్ని మార్చి వేయండి. మనం చూద్దాం! ఆమె మార్గదర్శకత్వం పొందుతుందా, లేక మార్గదర్శకత్వం పొందని వారిలో చేరి పోతుందా
ఆ తరువాత ఆమె అక్కడికి రాగానే: "ఏమీ? నీ సింహాసనం విధంగానే ఉంటుందా?" అని అడుగ్గా, ఆమె: "నిశ్చయంగా, ఇది దాని మాదిరిగానే ఉంది!"అని అన్నది. మరియు (సులైమాన్ అన్నాడు): "మనకు ఈమె కంటే ముందు (దివ్య) జ్ఞానం ప్రసాదించ బడింది (లభించింది) కావున మనం అల్లాహ్ కు విధేయులం (ముస్లింలం) అయ్యాము
ఆమెతో: "రాజగృహంలో ప్రవేశించు!" అని చెప్పగా! ఆమె దానిని చూసి, అదొక నీటి కొలనని భావించి (తన వస్త్రాలను) పైకెత్తగా ఆమె పిక్కలు కనబడ్డాయి. అప్పుడు (సులైమాన్): "ఇది గాజుతో నిర్మించబడిన నున్నని నేల మాత్రమే!" అని అన్నాడు. (రాణి) అన్నది: "ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. మరియు నేను సులైమాన్ తో పాటు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు విధేయతను (ఇస్లాంను) స్వీకరిస్తున్నాను
మరియు వాస్తవంగా! మేము సమూద్ జాతివారి వద్దకు వారి సోదరుడైన సాలిహ్ ను: "మీరు అల్లాహ్ నే ఆరాధించండి." అనే (సందేశంతో) పంపాము. కాని వారు రెండు వర్గాలుగా చీలి పోయి పరస్పరం కలహించుకోసాగారు
(సాలిహ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు సుస్థితికి ముందు దుస్థితి కొరకు ఎందుకు తొందరపెడుతున్నారు? మీరు అల్లాహ్ ను మీ తప్పులను క్షమించమని ఎందుకు వేడుకోరు? బహశా మీరు కరుణించబడవచ్చు
వారన్నారు: "మేము నిన్నూ మరియు నీ అనుచరులను అపశకునపు సూచనలుగా పరిగణిస్తున్నాము!" (సాలిహ్) అన్నాడు: "మీ శకునం అల్లాహ్ వద్ద ఉంది. వాస్తవానికి, మీరు పరీక్షించ బడుతున్నారు
వారు పరస్పరం ఇలా అనుకున్నారు: "అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా ప్రతిజ్ఞ చేయండి. మనం అతనిపై మరియు అతనితో పాటు ఉన్న వారిపై రాత్రివేళ దాడి చేద్దాము. తరువాత అతని వారసులతో: 'మీ సంబంధీకులను వధించింది మేము చూడనే లేదు. మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము.' "అని అందాము
కాని, అతని జాతివారి జవాబు ఈ విధంగా మాత్రమే ఉండింది. వారు అన్నారు: "లూత్ కుటుంబాన్ని మీ పట్టణం నుండి వెళ్ళ గొట్టండి. వాస్తవానికి, వారు తమను తాము చాలా పవిత్రులుగా పరిగణిస్తున్నారు
(ఓ ముహమ్మద్!) ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఆయన ఎన్నుకొన్న, ఆయన దాసులకు శాంతి కలుగు గాక (సలాం)! ఏమీ? అల్లాహ్ శ్రేష్ఠుడా? లేక వారు ఆయనకు సాటి కల్పించే భాగస్వాములా
ఏమీ? ఆయనే కాడా? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించినవాడు మరియు మీ కొరకు ఆకాశం నుండి నీటిని కురిపించిన వాడు? దానితో మేము మనోహరమైన తోటలను పుట్టించాము. వాటిలో ఒక్క చెట్టును కూడా మొలిపించటం మీకు సాధ్యమయ్యే పని కాదు కదా? ఏమీ? అల్లాహ్ తో బాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? అలా కాదు! వారే (ఇతరులను) ఆయనకు సమానులుగా చేసే ప్రజలు
ఏమీ? ఆయనే కాడా? భూమిని నివాసస్థలంగా చేసి, దాని మధ్య నదులను ఏర్పరచి, అది కదలకుండా దానిపై పర్వతాలను మేకులుగా నాటినవాడు మరియు రెండు సముద్రాల మధ్య అడ్డుతెరను నిర్మించిన వాడు? ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వాస్తవానికి చాలా మంది ఇది తెలుసుకోలేరు
ఏమీ? ఆయనే కాడా? బాధితుడు వేడుకున్నప్పుడు అతడి మొరను ఆలకించి ఆపదను తొలగించేవాడు మరియు భూమిలో మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసినవాడు? ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? మీరు ఆలోచించేది చాలా తక్కువ
ఏమీ? ఆయనే కాడా? నేల మరియు సముద్రాల, అంధకారంలో మీకు మార్గదర్శకత్వం చేసేవాడు మరియు తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలతో పంపేవాడు? ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారు సాటిగా కల్పించే భాగస్వాముల కంటే అల్లాహ్ అత్యున్నతుడు
ఏమీ? ఆయనే కాడా? సృష్టిని తొలిసారి ప్రారంభించి, తరువాత దానిని మరల ఉనికిలోకి తేగలవాడు మరియు మీకు ఆకాశం నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడు. ఏమీ? అల్లాహ్ తో పాటు మరొక దేవుడు ఎవడైనా ఉన్నాడా? వారితో అను: "మీరు సత్యవంతులే అయితే మీ నిదర్శనాన్ని తీసుకురండి
మరియు నీవు అంధులను మార్గభ్రష్టత్వం నుండి తొలగించి, వారికి మార్గదర్శకత్వం చేయలేవు. మా సూచనలను (ఆయాత్ లను) విశ్వసించి, అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయ్యే వారికి మాత్రమే నీవు (నీ మాటలను) వినిపించగలవు
మరియు వారిని గురించిన (శిక్ష) వాగ్దానం పూర్తికానున్నప్పుడు, మేము వారి కొరకు భూమి నుండి ఒక జంతువును బయటికి తీస్తాము. అది వారితో నిశ్చయంగా, మానవులు మా సూచలను (ఆయాత్ లను) నమ్మేవారు కాదని చెబుతుంది
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు (పునరుత్థాన దినమున) మేము ప్రతి జాతివారిలో నుండి మా సూచనలను అసత్యాలని తిరస్కరించిన జనసమూహాన్ని సమీకరిస్తాము. మరియు వారు (వారి పాపాల ప్రకారం) వివిధ వరుసలలో నిలబెట్టబడతారు
చివరకు అందరూ వచ్చిన తరువాత వారి (ప్రభువు) వారిని ప్రశ్నిస్తాడు: "ఏమీ? మీరు నా సూచనలను, మీ జ్ఞానంతో గ్రహించకుండానే వాటిని అసత్యాలని తిరస్కరించారా? ఇదిగాక మీరు ఏమి చేస్తూ ఉండేవారు
ఏమీ? వారికి తెలియదా? మేము రాత్రిని వారు విశ్రాంతి పొందటానికి మరియు పగటిని (చూడగలగటానికి) ప్రకాశవంతంగా చేశామని? నిశ్చయంగా, విశ్వసించేవారికి ఇందులో ఎన్నో సూచనలున్నాయి
మరియు (జ్ఞాపకముంచుకోండి) బాకా (సూర్) ఊదబడే దినమున - అల్లాహ్ కోరిన వారు తప్ప - ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్నవన్నీ భయంతో కంపించి పోతాయి. మరియు ఆన్నీ అత్యంత వినమ్రతతో ఆయన ముందు హాజరవుతాయి
మరియు నీవు పర్వతాలను చూసి అవి స్థిరంగా ఉన్నాయని అనుకుంటున్నావు. కాని అవి అప్పుడు మేఘాల వలే ఎగురుతూ పోతుంటాయి. ఇది అల్లాహ్ కార్యం! ఆయన ప్రతి కార్యాన్ని నేర్పుతో చేస్తాడు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయన ఎరుగును
(ఓ ముహమ్మద్!) వారితో (ఇలా అను): "నిశ్చయంగా, ఈ (మక్కా) నగరపు ప్రభువునే ఆరాధించాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఆయనే! దీనిని పవిత్ర క్షేత్రంగా చేశాడు మరియు ప్రతి వస్తువు ఆయనకు చెందినదే! మరియు నేను ఆయనకు విధేయుడనై (ముస్లింనై) ఉండాలని నాకు ఆజ్ఞ ఇవ్వబడింది
మరియు ఈ ఖుర్ఆన్ ను చదివి వినిపించాలని కూడా (ఆజ్ఞ ఇవ్వబడింది). కావున మార్గదర్శకత్వం పొందినవాడు తన మేలుకే, మార్గదర్శకత్వం పొందుతాడు. మరియు మార్గభ్రష్టుడైన వాడితో అను: "నిశ్చయంగా, నేను హెచ్చరిక చేసేవాడను మాత్రమే
వారితో (ఇంకా) ఇలా అను: "సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! త్వరలోనే ఆయన మీకు తన సూచనలను చూపుతాడు, అప్పుడు మీకు తెలుస్తుంది. మరియు మీరు చేస్తున్న కార్యాలను నీ ప్రభువు ఎరుగకుండా లేడు