Back to Languages

Telugu - Chapter 43 - Az-Zukhruf

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Az-Zukhruf 43:1

హా - మీమ్

Verse 2 — Surah Az-Zukhruf 43:2

స్పష్టమైన ఈ గ్రంథం (ఖుర్ఆన్) సాక్షిగా

Verse 3 — Surah Az-Zukhruf 43:3

నిశ్చయంగా, మీరు అర్థం చేసుకోగలగటానికి, మేము దీనిని అరబ్బీ భాషలో ఖుర్ఆన్ గా అవతరింపజేశాము

Verse 4 — Surah Az-Zukhruf 43:4

మరియు నిశ్చయంగా, ఇది మా వద్ద నున్న మాతృ గ్రంథంలోనిదే! అది మహోన్నతమైనది, వివేకంతో నిండి ఉన్నది

Verse 5 — Surah Az-Zukhruf 43:5

ఏమిటి? మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారని, మేము ఈ హితోపదేశాన్ని (ఖుర్ఆన్ ను) మీ నుండి తొలగించాలా

Verse 6 — Surah Az-Zukhruf 43:6

మరియు మేము పూర్వం గతించిన వారి వద్దకు ఎంతో మంది ప్రవక్తలను పంపాము

Verse 7 — Surah Az-Zukhruf 43:7

మరియు వారు, తమ వద్దకు వచ్చిన ప్రవక్తలలో ఏ ఒక్కరిని కూడా ఎగతాళి చేయకుండా వదల లేదు

Verse 8 — Surah Az-Zukhruf 43:8

కావున వీరి కంటే ఎంతో బలిష్ఠులైన వారిని మేము పట్టుకొని నాశనం చేశాము. మరియు పూర్వ జాతుల వారి దృష్టాంతాలు ఈ విధంగా గడిచాయి

Verse 9 — Surah Az-Zukhruf 43:9

ఒకవేళ, నీవు వారితో: "భూమ్యాకాశాలను ఎవరు సృష్టించారు?" అని అడిగితే! వారు తప్పక: "వాటిని సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు సృష్టించాడు." అని అంటారు

Verse 10 — Surah Az-Zukhruf 43:10

ఆయనే మీ కొరకు ఈ భూమిని పరుపుగా చేశాడు; మరియు మీరు మీ గమ్యస్థానాలకు చేరుకోవడానికి, అందులో మీ కొరకు త్రోవలు ఏర్పరచాడు

Verse 11 — Surah Az-Zukhruf 43:11

మరియు ఆయనే ఆకాశం నుండి తగినంత నీటిని (వర్షాన్ని) కురిపించాడు. తరువాత దాని ద్వారా మేము చచ్చిన నేలను బ్రతికిస్తాము. ఇదే విధంగా మీరు కూడా (బ్రతికింపబడి) బయటికి తీయబడతారు

Verse 12 — Surah Az-Zukhruf 43:12

మరియు ఆయనే అన్ని రకాల జతలను పుట్టించాడు! మరియు ఓడలను మరియు పశువులను మీకు వాహనాలుగా చేశాడు

Verse 13 — Surah Az-Zukhruf 43:13

మీరు వాటి వీపుల మీద ఎక్కటానికి; తరువాత మీరు వాటి మీద కూర్చున్నప్పుడు, మీ ప్రభువు అనుగ్రహాన్ని తలచుకొని ఇలా ప్రార్థించటానికి: "ఆ సర్వలోపాలకు అతీతుడైన ఆయన (అల్లాహ్) వీటిని మాకు వశపరచాడు, లేకపోతే ఆ (వశపరచుకునే) సామర్థ్యం మాకు లేదు

Verse 14 — Surah Az-Zukhruf 43:14

మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది

Verse 15 — Surah Az-Zukhruf 43:15

మరియు వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా (భాగస్వాములుగా / సంతానంగా) చేశారు. నిశ్చయంగా, మానవుడు పరమ కృతఘ్నుడు

Verse 16 — Surah Az-Zukhruf 43:16

ఏమిటి? ఆయన తాను సృష్టించిన వాటిలో నుండి తన కొరకు కుమార్తెలను తీసుకొని మీ కొరకు ప్రత్యేకంగా కుమారులను ఉంచాడా

Verse 17 — Surah Az-Zukhruf 43:17

మరియు వారు, కరుణామయునికి అంటగట్టేది (ఆడ సంతానమే గనక) వారిలో ఎవడికైనా కలిగిందనే వార్త అంద జేయబడి నప్పుడు, అతని ముఖం నల్లబడిపోతుంది మరియు అతడు దుఃఖంలో మునిగి పోతాడు

Verse 18 — Surah Az-Zukhruf 43:18

ఏమీ? ఆభరణాల అలంకారంలో పెంచబడి మరియు వివాదంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా వివరించలేని (స్త్రీ సంతానాన్ని అల్లాహ్ కు అంటగట్టుతున్నారా)

Verse 19 — Surah Az-Zukhruf 43:19

మరియు వీరు కరుణామయునికి దాసులైన దేవదూతలను స్త్రీలుగా పరిగణిస్తున్నారా? వీరు! వారు (దేవదూతలు) సృష్టించబడినప్పుడు చూశారా ఏమిటి? వీరి ఆరోపణలు వ్రాసి వుంచబడతాయి. మరియు వీరు దానిని గురించి ప్రశ్నింపబడతారు

Verse 20 — Surah Az-Zukhruf 43:20

మరియు వారు ఇలా అంటారు: "ఒకవేళ ఆ కరుణామయుడు తలచుకుంటే మేము వారిని ఆరాధించేవారం కాదు." దాని వాస్తవ జ్ఞానం వారికి లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు

Verse 21 — Surah Az-Zukhruf 43:21

మేము వారికి ఇంతకు ముందు ఏదైనా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నామా ఏమిటి? వారు దానిని ఖచ్చితంగా అనుసరించటానికి

Verse 22 — Surah Az-Zukhruf 43:22

అలా కాదు! వారిలా అంటారు: "వాస్తవానికి మేము, మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తుండగా చూశాము. మరియు నిశ్చయంగా మేము కూడా వారి అడుగుజాడల్లోనే వారి మార్గదర్శకత్వంపై ఉన్నాము

Verse 23 — Surah Az-Zukhruf 43:23

మరియు ఇదే విధంగా, నీకు ముందు (ఓ ముహమ్మద్!) మేము హెచ్చరించే వాడిని ఏ పట్టణానికి పంపినా దానిలోని ఐశ్వర్యవంతులు అనేవారు: "వాస్తవానికి మేము మా తండ్రితాతలను ఇలాంటి సమాజాన్నే (మతాన్నే) అనుసరిస్తూ ఉండగా చూశాము. మరియు నిశ్చయంగా, మేము కూడా వారి అడుగు జాడలనే అనుసరిస్తాము

Verse 24 — Surah Az-Zukhruf 43:24

(వారి ప్రవక్త) ఇలా అనేవాడు: "ఒకవేళ నేను మీ తండ్రితాతలు అనుసరిస్తూ వచ్చిన దాని కంటే ఉత్తమమైన మార్గదర్శకత్వాన్ని మీ కోసం తెచ్చినా (మీరు వారినే అనుసరిస్తారా)?" వారిలా జవాబిచ్చే వారు: "నిశ్చయంగా, మీరు దేనితో పంపబడ్డారో దానిని మేము తిరస్కరిస్తున్నాము

Verse 25 — Surah Az-Zukhruf 43:25

కావున మేము వారిపై మా ప్రతీకారాన్ని (శిక్షను) పంపాము. చూశారా! సత్యాన్ని తిరస్కరించిన వారి గతి ఏమయిందో

Verse 26 — Surah Az-Zukhruf 43:26

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్ తన తండ్రి మరియు తన జాతివారితో ఇలా అన్నప్పుడు: "నిశ్చయంగా, మీరు పూజించే వారితో నాకు ఎలాంటి సంబంధం లేదు

Verse 27 — Surah Az-Zukhruf 43:27

(నేనైతే) నన్ను సృజించిన ఆయన (అల్లాహ్ నే ఆరాధిస్తాను). ఎందుకంటే! నిశ్చయంగా, ఆయనే నాకు మార్గదర్శకత్వం చేయగలడు

Verse 28 — Surah Az-Zukhruf 43:28

మరియు అతను (ఇబ్రాహీమ్) ఈ వచనాన్నే తన తర్వాత తన సంతానం కొరకు విడిచి వెళ్ళాడు. వారు దాని వైపుకు మరలుతారని

Verse 29 — Surah Az-Zukhruf 43:29

వాస్తవానికి, నేను వారికి మరియు వారి తండ్రితాతలకు ప్రాపంచిక సుఖసంతోషాలను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి వద్దకు సత్యం మరియు (దానిని) స్పష్టంగా వివరించే దైవప్రవక్త కూడా వచ్చాడు

Verse 30 — Surah Az-Zukhruf 43:30

కాని వారి వద్దకు సత్యం (ఈ ఖుర్ఆన్) వచ్చినప్పుడు వారన్నారు: "ఇది కేవలం మంత్రజాలమే. మరియు నిశ్చయంగా, మేము దీనిని తిరస్కరిస్తున్నాము

Verse 31 — Surah Az-Zukhruf 43:31

వారు ఇంకా ఇలా అన్నారు: "ఈ ఖుర్ఆన్ ఈ రెండు నగరాలలోని ఒక గొప్ప వ్యక్తిపై ఎందుకు అవతరింప జేయబడలేదు

Verse 32 — Surah Az-Zukhruf 43:32

నీ ప్రభువు కారుణ్యాన్ని పంచి పెట్టే వారు వారేనా ఏమిటి? మేమే వారి జీవనోపాయాలను, ఈ ప్రాపంచిక జీవితంలో వారి మధ్య పంచి పెట్టాము. వారు ఒకరితో నొకరు పని తీసుకోవటానికి, వారిలో కొందరికి మరి కొందరిపై స్థానాలను పెంచాము. మరియు వారు కూడబెట్టే దాని (సంపద) కంటే నీ ప్రభువు కారుణ్యమే ఎంతో ఉత్తమమైనది

Verse 33 — Surah Az-Zukhruf 43:33

మరియు మానవులందరూ ఒక (దుష్ట) సమాజంగా మారి పోతారన్న భయమే గనక మాకు లేకున్నట్లయితే, మేము ఆ కరుణామయుణ్ణి తిరస్కరించేవారి ఇళ్ళ కప్పులనూ మరియు వాటి పైకి ఎక్కే మెట్లను వెండితో నిర్మించేవారము

Verse 34 — Surah Az-Zukhruf 43:34

మరియు వారి ఇండ్ల తలుపులను మరియు వారు ఆనుకొని కూర్చునే పీఠాలను కూడా

Verse 35 — Surah Az-Zukhruf 43:35

మరియు బంగారంతో కూడా! మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి నీ ప్రభువు వద్ద పరలోక జీవిత (సుఖం) ఉంటుంది

Verse 36 — Surah Az-Zukhruf 43:36

మరియు ఎవడైతే కరుణామయుని స్మరణ విషయంలో అంధుడిగా ప్రవర్తిస్తాడో అతనిపై మేము ఒక షైతాన్ ను నియమిస్తాము. ఇక వాడు (ఆ షైతాన్) వాని సహచరుడు (ఖరీనున్) అవుతాడు

Verse 37 — Surah Az-Zukhruf 43:37

మరియు నిశ్చయంగా, వారు (షైతాన్ లు) వారిని (అల్లాహ్) మార్గం నుండి ఆటంక పరుస్తారు. మరియు వారేమో నిశ్చయంగా, తాము సరైన మార్గదర్శకత్వంలోనే ఉన్నామని భావిస్తారు

Verse 38 — Surah Az-Zukhruf 43:38

చివరకు అతడు మా వద్దకు వచ్చినపుడు (తన వెంట ఉన్న షైతాన్ తో) ఇలా అంటాడు: "అయ్యో! నా దౌర్భాగ్యం! నీకూ నాకూ మధ్య తూర్పుపడమరల మధ్య ఉన్నంత దూరం ఉండి వుంటే ఎంత బాగుండేది! ఎందుకంటే నీవు అతి చెడ్డ సహచరుడివి

Verse 39 — Surah Az-Zukhruf 43:39

మరియు మీరు దుర్మార్గం చేశారు! కావున, ఈరోజు మీరంతా ఈ శిక్షలో కలిసి ఉండటం మీకు ఏ మాత్రం లాభదాయకం కాదు

Verse 40 — Surah Az-Zukhruf 43:40

(ఓ ముహమ్మద్!) నీవు చెవిటి వాడికి వినిపింప జేయగలవా? లేదా గ్రుడ్డివాడికి మార్గం చూపించ గలవా? లేక, స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో ఉన్నవాడికి (మార్గదర్శకత్వం చేయగలవా)

Verse 41 — Surah Az-Zukhruf 43:41

ఒకవేళ వాస్తవానికి, మేము నిన్ను తీసుకొని పోయినా, వారికి మాత్రం తప్పకుండా ప్రతీకారం చేస్తాము

Verse 42 — Surah Az-Zukhruf 43:42

లేదా మేము వారికి వాగ్దానం చేసిన దానిని (శిక్షను) నీకు తప్పక చూపగలము. ఎందుకంటే మాకు వారిపై పూర్తి అధికారముంది

Verse 43 — Surah Az-Zukhruf 43:43

కావున నీవు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా వచ్చిన సందేశం మీద స్థిరంగా ఉండు. నిశ్చయంగా, నీవు ఋజుమార్గం మీద ఉన్నావు

Verse 44 — Surah Az-Zukhruf 43:44

మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) నీకు మరియు నీ జాతి వారికి ఒక హితబోధ. మరియు (దీనిని గురించి) మీరు ప్రశ్నింప బడగలరు

Verse 45 — Surah Az-Zukhruf 43:45

మరియు (ఓ ముహమ్మద్!) నీకు పూర్వం మేము పంపిన మా ప్రవక్తలను అడుగు: "మేము, ఆ కరుణామయుడు తప్ప ఇతర దైవాలను ఆరాధింపబడటానికి నియమించామేమో

Verse 46 — Surah Az-Zukhruf 43:46

మరియు వాస్తవంగా, మేము మూసాను, మా సూచనలతో (ఆయాత్ లతో) ఫిర్ఔన్ మరియు అతని నాయకుల వద్దకు పంపాము. అతను వారితో ఇలా అన్నాడు: "నిశ్చయంగా, నేను సర్వలోకాల ప్రభువు యొక్క సందేశహరుణ్ణి

Verse 47 — Surah Az-Zukhruf 43:47

కాని, అతను వారి వద్దకు మా సూచన (ఆయాత్) లను తీసుకొని వచ్చినప్పుడు, వారు వాటిని గురించి పరిహాసాలాడేవారు

Verse 48 — Surah Az-Zukhruf 43:48

మరియు మేము వారికి చూపిన ప్రతి అద్భుత సూచన (ఆయాత్), దానికి ముందు చూపినటువంటి దాని (అద్భుత సూచన) కంటే మించినదిగా ఉండేది. మరియు మేము వారిని శిక్షకు గురి చేశాము. బహుశా, ఇలాగైనా వారు మరలి వస్తారేమోనని

Verse 49 — Surah Az-Zukhruf 43:49

మరియు వారు (మూసాతో) ఇలా అన్నారు: "ఓ మాంత్రికుడా! (నీ ప్రభువు) నీతో చేసిన ఒప్పందం ప్రకారం నీ ప్రభువును ప్రార్థించు, మేము తప్పక సన్మార్గులమవుతాము

Verse 50 — Surah Az-Zukhruf 43:50

కాని మేము వారి పై నుండి ఆ శిక్షను తొలగించిన వెంటనే వారు తమ వాగ్దానాన్ని భంగపరచే వారు

Verse 51 — Surah Az-Zukhruf 43:51

మరియు, ఫిర్ఔన్ తన జాతి ప్రజలలో ప్రకటిస్తూ ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈజిప్టు (మిస్ర్) యొక్క సామ్రాజ్యాధిపత్యం నాది కాదా? మరియు ఈ సెలయేళ్ళు నా క్రింద ప్రవహించటం లేదా? ఇది మీకు కనిపించటం లేదా

Verse 52 — Surah Az-Zukhruf 43:52

ఈ తుచ్ఛమైన వాడు మరియు (తన మాటను) స్పష్టంగా వివరించలేని వాడి (మూసా) కంటే నేను శ్రేష్ఠుడిని కానా

Verse 53 — Surah Az-Zukhruf 43:53

అయితే ఇతనికి బంగారు కంకణాలు ఎందుకు వేయబడలేదు? లేదా, ఇతనికి తోడుగా ఇతనితో పాటు దేవదూతలు ఎందుకు రాలేదు

Verse 54 — Surah Az-Zukhruf 43:54

ఈ విధంగా, అతడు (ఫిర్ఔన్) తన జాతి వారిని ప్రేరేపింప జేయటం వలన వారు అతనిని అనుసరించారు. నిశ్చయంగా వారు దుర్జనులు (ఫాసిఖీన్)

Verse 55 — Surah Az-Zukhruf 43:55

ఈ విధంగా, వారు మమ్మల్ని కోపానికి గురి చేయటం వల్ల మేము వారికి ప్రతీకారం చేశాము. మరియు వారందరినీ ముంచి వేశాము

Verse 56 — Surah Az-Zukhruf 43:56

ఇక మేము, వారిని తర్వాత వచ్చే వారి కొరకు ఒక గడిచిన నిదర్శనంగా మరియు ఒక ఉదాహరణగా చేశాము

Verse 57 — Surah Az-Zukhruf 43:57

మరియు మర్యమ్ కుమారుడు ఒక ఉదాహరణగా పేర్కొనబడినప్పుడు (ఓ ముహమ్మద్!) నీ జాతి ప్రజలు అతనిని గురించి కేకలు వేస్తారు

Verse 58 — Surah Az-Zukhruf 43:58

మరియు అంటారు: "మా దేవుళ్ళు మంచివా లేక అతడా (ఈసానా)?" వారు ఈ విషయం నీ ముందు పెట్టేది కేవలం జగడమాడటానికే. వాస్తవానికి వారు కలహ ప్రియులైన జనులు

Verse 59 — Surah Az-Zukhruf 43:59

అతను (ఈసా) కేవలం ఒక దాసుడు మాత్రమే. మేము అతనిని అనుగ్రహిచాము. మరియు మేము అతనిని ఇస్రాయీల్ సంతతి వారికి ఒక నిదర్శనంగా చేశాము

Verse 60 — Surah Az-Zukhruf 43:60

మరియు మేము కోరితే మీకు బదులుగా, దేవదూతలను భూమిపై ఉత్తరాధికారులుగా చేసే వారము

Verse 61 — Surah Az-Zukhruf 43:61

మరియు నిశ్చయంగా, అతని (ఈసా పునరాగమనం) అంతిమ ఘడియ రావటానికి సూచన. కావున మీరు దానిని (ఆ ఘడియను) గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే (అల్లాహ్ నే) అనుసరించండి, ఇదే ఋజుమార్గం

Verse 62 — Surah Az-Zukhruf 43:62

మరియు షైతాన్ ను, మిమ్మల్ని ఆటంక పరచనివ్వకండి. నిశ్చయంగా, అతడు మీకు బహిరంగ శత్రువు

Verse 63 — Surah Az-Zukhruf 43:63

మరియు ఈసా స్పష్టమైన (మా) సూచనలు తీసుకొని వచ్చినప్పుడు ఇలా అన్నాడు: "వాస్తవంగా, నేను మీ వద్దకు వివేకాన్ని తీసుకొని వచ్చాను; మరియు మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కావున మీరు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నన్ను అనుసరించండి

Verse 64 — Surah Az-Zukhruf 43:64

నిశ్చయంగా, అల్లాహ్ యే నా ప్రభువు మరియు మీ ప్రభువు కూడాను. కావున మీరు ఆయననే ఆరాధించండి. ఇదే ఋజుమార్గం

Verse 65 — Surah Az-Zukhruf 43:65

అయినా, తరువాత వచ్చిన వర్గాల వారు పరస్పర వర్గ భేదాలకు లోనయ్యారు. కావున దుర్మర్గానికి పాల్పడిన వారికి బాధాకరమైన ఆ దినమున శిక్ష పడుతుంది

Verse 66 — Surah Az-Zukhruf 43:66

వారు కేవలం ఆ అంతిమ ఘడియ అకస్మాత్తుగా - తమకు తెలియకుండానే - తమపై వచ్చి పడాలని నిరీక్షిస్తున్నారా ఏమిటి

Verse 67 — Surah Az-Zukhruf 43:67

ఆ దినమున దైవభీతి గలవారు తప్ప ఇతర స్నేహితులంతా ఒకరి కొకరు శత్రువులవుతారు

Verse 68 — Surah Az-Zukhruf 43:68

(విశ్వాసులతో ఇలా అనబడుతుంది): "ఓ నా దాసులారా! ఈనాడు మీకు ఏ భయమూ లేదు మరియు మీరు దుఃఖ పడరు కూడా

Verse 69 — Surah Az-Zukhruf 43:69

అలాంటి వారు, ఎవరైతే మా సూచనలను విశ్వసించారో మరియు ముస్లింలు అయి ఉన్నారో

Verse 70 — Surah Az-Zukhruf 43:70

మీరు మరియు మీ సహవాసులు (అజ్వాజ్) సంతోషంగా స్వర్గంలో ప్రవేశించండి

Verse 71 — Surah Az-Zukhruf 43:71

వారి మధ్య, బంగారు పళ్ళాలు మరియు కప్పులు త్రిప్పబడతాయి మరియు అందులో మనస్సులు కోరేవి మరియు కళ్ళకు ఇంపుగా ఉండేవి, అన్నీ ఉంటాయి. మరియు మీరందులో శాశ్వతంగా ఉంటారు

Verse 72 — Surah Az-Zukhruf 43:72

మరియు మీరు చేస్తూ వున్న కర్మల ఫలితానికి బదులుగా, మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు

Verse 73 — Surah Az-Zukhruf 43:73

మీకు అందులో పండ్లూ ఫలాలు పుష్కలంగా ఉంటాయి, వాటిని మీరు తింటారు

Verse 74 — Surah Az-Zukhruf 43:74

నిశ్చయంగా, అపరాధులు నరకశిక్షలో శాశ్వతంగా ఉంటారు

Verse 75 — Surah Az-Zukhruf 43:75

వారి (శిక్ష) ఏ మాత్రం తగ్గించబడదు మరియు వారందులో హతాశులై పడి ఉంటారు

Verse 76 — Surah Az-Zukhruf 43:76

మేము వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే దుర్మార్గులై ఉండిరి

Verse 77 — Surah Az-Zukhruf 43:77

మరియు వారిలా మొరపెట్టుకుంటారు: "ఓ నరక పాలకుడా (మాలిక్)! నీ ప్రభువును మమ్మల్ని అంతం చేయమను." అతను అంటాడు: "నిశ్చయంగా మీరిక్కడే (ఇదే విధంగా) పడి ఉంటారు

Verse 78 — Surah Az-Zukhruf 43:78

వాస్తవానికి మేము మీ వద్దకు సత్యాన్ని తీసుకొని వచ్చాము, కాని మీలో చాలా మంది సత్యమంటేనే అసహ్యించుకునే వారు

Verse 79 — Surah Az-Zukhruf 43:79

వారు ఏదైనా నిర్ణయం (పన్నాగం) చేస్తున్నారా ఏమిటి? అయితే నిశ్చయంగా మేము కూడా ఒక గట్టి నిర్ణయం (పన్నాగం) చేస్తున్నాము

Verse 80 — Surah Az-Zukhruf 43:80

లేదా! మేము వారి రహస్య విషయాలను మరియు వారి గుసగుసలను వినటం లేదని వారనుకుంటున్నారా? అలా కాదు, (వాస్తవానికి) మా దూతలు వారి దగ్గర ఉండి, అంతా వ్రాస్తున్నారు

Verse 81 — Surah Az-Zukhruf 43:81

వారితో ఇలా అను: "ఒకవేళ ఆ కరుణామయునికి కుమారుడే ఉంటే, అందరి కంటే ముందు నేనే అతనిని ఆరాధించేవాడిని

Verse 82 — Surah Az-Zukhruf 43:82

భూమ్యాకాశాలకు ప్రభువు మరియు సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువు అయిన ఆయన (అల్లాహ్) వారి కల్పనలకు అతీతుడు

Verse 83 — Surah Az-Zukhruf 43:83

వారికి వాగ్దానం చేయబడిన ఆ దినాన్ని వారు దర్శించే వరకు, వారిని వారి వాదోపవాదాలలో మరియు వారి క్రీడలలో మునిగి ఉండనీ

Verse 84 — Surah Az-Zukhruf 43:84

మరియు ఆయన (అల్లాహ్) మాత్రమే ఆకాశాలలో ఆరాధ్యుడు మరియు భూమిలో కూడా ఆరాధ్యుడు. మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు

Verse 85 — Surah Az-Zukhruf 43:85

మరియు ఆకాశాలలోను మరియు భూమిలోను మరియు ఆ రెండింటి మధ్యను ఉన్న సమస్తానికీ సామ్రాజ్యాధికారి అయిన ఆయన (అల్లాహ్) శుభదాయకుడు; మరియు అంతిమ ఘడియ జ్ఞానం కేవలం ఆయనకే ఉంది; మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు

Verse 86 — Surah Az-Zukhruf 43:86

మరియు వారు ఆయనను వదలి, ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారికి సిఫారసు చేసే అధికారం లేదు. కేవలం సత్యానికి సాక్ష్యమిచ్చేవారు మరియు (అల్లాహ్ ఒక్కడే! అని) తెలిసి ఉన్నవారు తప్ప

Verse 87 — Surah Az-Zukhruf 43:87

మరియు నీవు: "మిమ్మల్ని ఎవరు సృష్టించారు?" అని వారితో అడిగినప్పుడు, వారు నిశ్చయంగా: "అల్లాహ్!" అని అంటారు. అయితే వారు ఎందుకు మోసగింప బడుతున్నారు (సత్యం నుండి మరలింపబడుతున్నారు)

Verse 88 — Surah Az-Zukhruf 43:88

మరియు ఓ నా ప్రభూ! నిశ్చయంగా, ఈ ప్రజలు విశ్వసించరు!" అని పలికే (ప్రవక్త యొక్క) మాట (అల్లాహ్ కు బాగా తెలుసు)

Verse 89 — Surah Az-Zukhruf 43:89

కావున నీవు (ఓ ముహమ్మద్!) వారిని ఉపేక్షించు. మరియు ఇలా అను: "మీకు సలాం!" మున్ముందు వారు తెలుసుకుంటారు