మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో మరియు అల్లాహ్ ఆకాశం నుండి జీవనోపాధిని (వర్షాన్ని) పంపి, దాని ద్వారా భూమికి దాని మరణం తర్వాత, తిరిగి జీవం పోయటంలో మరియు వాయువుల మారటంలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి
ఇవి అల్లాహ్ సూచనలు (ఆయాత్), మేము వీటిని నీకు యథాతథంగా వినిపిస్తున్నాము. ఇక వారు అల్లాహ్ ను మరియు ఆయన సూచనలను (ఆయాత్ లను) కాక మరే సమాచారాన్ని విశ్వసిస్తారు
అతడు తన ముందు పఠించబడే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) వింటున్నాడు ఆ తరువాత మూర్ఖపు పట్టుతో దురహంకారంతో వాటిని విననట్లు వ్యవహరిస్తున్నాడు. కావున అతనికి బాధాకరమైన శిక్ష పడనున్నదనే వార్తను వినిపించు
వారి ముందు నరకముంటుంది. మరియు వారి సంపాదన వారికి ఏ మాత్రం పనికిరాదు మరియు అల్లాహ్ ను వదలి వారు సంరక్షకులుగా చేసుకున్నవారు కూడా వారికి ఏ విధంగానూ ఉపయోగపడరు. మరియు వారికి ఘోరమైన శిక్ష ఉంటుంది
అల్లాహ్! ఆయనే, సముద్రాన్ని మీకు ఉపయుక్తంగా చేశాడు; దానిలో తన ఆజ్ఞతో ఓడలు పయనించటానికి మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు బహుశా మీరు కృతజ్ఞులవుతారని
మరియు వాస్తవంగా, మేము ఇస్రాయీల్ సంతతి వారికి గ్రంథాన్ని (తౌరాత్ ను), వివేకాన్ని మరియు ప్రవక్త పదవులను ప్రసాదించి ఉన్నాము మరియు వారికి మంచి జీవనోపాధిని ప్రసాదించి ఉన్నాము మరియు వారిని (వారి కాలపు) ప్రజలపై ప్రత్యేకంగా ఆదరించి ఉన్నాము
మరియు వారికి ధర్మ విషయంలో స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఉన్నాము. వారు తమ పరస్పర ద్వేషాల వల్ల వారికి జ్ఞానం వచ్చిన పిదపనే విభేదాలకు లోనయ్యారు. నిశ్చయంగా, నీ ప్రభువు వారి మధ్య ఉన్న విభేదాలను గురించి పునరుత్థాన దినమున, వారి మధ్య తీర్పు చేస్తాడు
నిశ్చయంగా వారు, నీకు - అల్లాహ్ కు ప్రతిగా - ఏ మాత్రం ఉపయోగపడలేరు. మరియు నిశ్చయంగా, దుర్మార్గులు ఒకరికొకరు రక్షకులు. మరియు అల్లాహ్ యే దైవభీతి గలవారి సంరక్షకుడు
దుష్కార్యాలకు పాల్పడిన వారు, వారి ఇహలోక జీవితంలోనూ మరియు వారి మరణానంతర జీవితంలోనూ - వారినీ మరియు విశ్వసించి సత్కార్యాలు చేసే వారినీ - మేము ఒకే విధంగా పరిగణిస్తామని భావిస్తున్నారా ఏమిటి? వారి నిర్ణయాలు ఎంత చెడ్డవి
తన మనోవాంఛలను తన దైవంగా చేసుకున్న వానిని నీవు చూశావా? మరియు అతడు జ్ఞానవంతుడు అయినప్పటికీ, అల్లాహ్! అతనిని మార్గభ్రష్టత్వంలో వదిలాడు మరియు అతని చెవుల మీద మరియు అతని హృదయం మీద ముద్ర వేశాడు మరియు అతని కళ్ళ మీద తెరవేశాడు; ఇక అల్లాహ్ తప్ప అతనికి మార్గదర్శకత్వం చేసే వాడెవడున్నాడు? ఇది మీరు గ్రహించలేరా
మరియు వారిలా అంటారు: "మా (జీవితం) కేవలం ఈ ప్రాపంచిక జీవితం మాత్రమే! మేము మరణించేది మరియు జీవించేది ఇక్కడే మరియు మమ్మల్ని నశింపజేసేది ఈ కాలచక్రం మాత్రమే!" మరియు వాస్తవానికి, దానిని గురించి వారికి ఎలాంటి జ్ఞానం లేదు. వారు కేవలం ఊహాగానాలే చేస్తున్నారు
మరియు వారి ముందు స్పష్టమైన మా సూచనలు (ఆయాత్) వినిపించబడి నప్పుడు: "మీరు సత్యవంతులే అయితే మా తాతముత్తాతలను (బ్రతికించి) తీసుకురండి!" అని మాత్రమే వాదిస్తారు
వారిలో ఇలా అను: "అల్లాహ్ యే మీకు జీవితమిచ్చేవాడు తరువాత మరణింప జేసేవాడు, ఆ పిదప పునరుత్థాన దినమున సమావేశ పరిచేవాడూను! ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయినా చాలా మంది జనులకు ఇది తెలియదు
మరియు ప్రతి సమాజం వారిని నీవు మోకరిల్లి ఉండటాన్ని చూస్తావు. ప్రతి జాతి వారిని తమ కర్మపత్రం వైపునకు పిలవడం జరుగుతుంది. (వారితో ఇలా అనబడుతుంది): "ఈ రోజు మీరు చేస్తూ ఉండిన కర్మలకు తగిన ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది
మరియు: "నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం మరియు అంతిమ ఘడియను గురించి ఎలాంటి సందేహం లేదు." అని అన్నప్పుడు మీరన్నారు: "ఆ అంతిమ ఘడియ ఏమిటో మాకు తెలియదు. అది కేవలం ఒక ఊహాగానం తప్ప మరేమీ కాదని మేము భావిస్తున్నాము. మేము దానిని ఏ మాత్రం నమ్మే వారము కాము
మరియు వారితో ఇలా అనబడుతుంది: "ఈ రోజు మేము మిమ్మల్ని మరచి పోతాము, ఏ విధంగానైతే మీరు మీ సమావేశపు ఈ దినాన్ని మరచిపోయారో! మరియు మీ నివాసం నరకాగ్నియే మరియు మీకు సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు
ఇది ఎందుకంటే, వాస్తవానికి మీరు అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) పరిహాసంగా తీసుకున్నారు. మరియు ఇహలోక జీవితం మిమ్మల్ని మోసపుచ్చింది. కావున ఈ రోజు వారిని దాని (నరకం) నుండి బయటికి తీయడం జరగదు. మరియు వారికి తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశమూ దొరకదు