Back to Languages

Telugu - Chapter 15 - Al-Hijr

Translation by Abdul Raheem Mohammad Moulana — Permalink

Verse 1 — Surah Al-Hijr 15:1

అలిఫ్ - లామ్ - రా. ఇవి దివ్యగ్రంథ ఆయత్ లు మరియు (ఇది) ఒక స్పష్టమైన ఖుర్ఆన్

Verse 2 — Surah Al-Hijr 15:2

సత్యతిరస్కారులు: "మేము అల్లాహ్ కు విధేయులమైతే (ముస్లింలమైతే) ఎంత బాగుండేది!" అని (పునరుత్థాన దినమున), పలుమార్లు కోరుకుంటారు

Verse 3 — Surah Al-Hijr 15:3

వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు

Verse 4 — Surah Al-Hijr 15:4

మరియు (దాని వ్యవధి) నిర్ణయించి వ్రాయబడి ఉండనిదే, మేము ఏ నగరాన్నీ కూడా నాశనం చేయలేదు

Verse 5 — Surah Al-Hijr 15:5

ఏ సమాజం కూడా తన నిర్ణీత గడువుకు, ముందు గానీ మరియు వెనుక గానీ కాజాలదు

Verse 6 — Surah Al-Hijr 15:6

మరియు (సత్యతిరస్కారులు) అంటారు: "ఓ హితబోధ (ఖుర్ఆన్) అవతరింప జేయబడిన వాడా (ముహమ్మద్)! నిశ్చయంగా నీవు పిచ్చివాడవు

Verse 7 — Surah Al-Hijr 15:7

నీవు సత్యవంతుడవే అయితే, మా వద్దకు దేవదూతలను ఎందుకు తీసుకొనిరావు

Verse 8 — Surah Al-Hijr 15:8

మేము దేవదూతలను, సత్యంతో తప్ప పంపము మరియు వారు వచ్చినప్పుడు వీరికి ఏ మాత్రం వ్యవధి ఇవ్వబడదు

Verse 9 — Surah Al-Hijr 15:9

నిశ్చయంగా, మేమే ఈ జ్ఞాపిక (ఖుర్ఆన్) ను అవతరింప జేశాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము

Verse 10 — Surah Al-Hijr 15:10

మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి మేము, నీకు పూర్వం గతించిన తెగల వారి వద్దకు కూడా (ప్రవక్తలను) పంపాము

Verse 11 — Surah Al-Hijr 15:11

మరియు వారి వద్దకు వచ్చిన ఏ ప్రవక్తను కూడా, వారు పరిహసించకుండా ఉండలేదు

Verse 12 — Surah Al-Hijr 15:12

ఈ విధంగా మేము దీనిని (సత్యతిరస్కారాన్ని) అపరాధుల హృదయాలలో ప్రవేశపెడుతున్నాము

Verse 13 — Surah Al-Hijr 15:13

వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించడం లేదు. మరియు వాస్తవానికి (సత్యతిరస్కారులైన) వారి పూర్వీకుల విధానం కూడా ఇలాగే ఉండేది

Verse 14 — Surah Al-Hijr 15:14

మరియు ఒకవేళ మేము వారి కొరకు ఆకాశపు ఒక ద్వారాన్ని తెరిచినా, వారు దానిపైకి ఎక్కుతూ పోతూ

Verse 15 — Surah Al-Hijr 15:15

ఇలా అనేవారు: "నిశ్చయంగా, మా చూపులు భ్రమింపజేయబడ్డాయి. అలా కాదు, మాపై మంత్రజాలం చేయబడింది

Verse 16 — Surah Al-Hijr 15:16

మరియు వాస్తవానికి, మేము ఆకాశంలో తారాగణాన్ని (నక్షత్రరాశులను) సృష్టించి, దానిని చూపరులకు అలంకారమైనదిగా చేశాము

Verse 17 — Surah Al-Hijr 15:17

మరియు శపించబడిన (బహిష్కరించబడిన) ప్రతి షైతాన్ నుండి దానిని (ఆకాశాన్ని) సురక్షితంగా ఉంచాము

Verse 18 — Surah Al-Hijr 15:18

కాని, ఎవడైనా (ఏ షైతానైనా) దొంగచాటుగా వినటానికి ప్రయత్నిస్తే, స్పష్టమైన కొరవి (అగ్ని జ్వాల) అతనిని వెంబడిస్తుంది

Verse 19 — Surah Al-Hijr 15:19

మరియు మేము భూమిని వ్యాపింపజేశాము మరియు దానిలో స్థిరమైన పర్వతాలను నాటాము మరియు దానిలో ప్రతి వస్తువును తగిన పరిమాణంలో ఉత్పత్తి చేశాము

Verse 20 — Surah Al-Hijr 15:20

మరియు అందులో మీకూ మరియు మీరు పోషించని వాటి కొరకూ (జీవరాసుల కొరకూ) మేము జీవనోపాధిని కల్పించాము

Verse 21 — Surah Al-Hijr 15:21

మరియు మా దగ్గర పుష్కలంగా నిలువలేని వస్తువు అంటూ ఏదీ లేదు మరియు దానిని మేము ఒక నిర్ణీత పరిమాణంలో మాత్రమే పంపుతూ ఉంటాము

Verse 22 — Surah Al-Hijr 15:22

మరియు మేము (వృక్షకోటిని) ఫలవంతం చేయటానికి గాలులను పంపుతాము! తరువాత మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిని మీకు త్రాగటానికి సమకూర్చుతాము మరియు దాని కోశాధికారులు మీరు మాత్రం కారు

Verse 23 — Surah Al-Hijr 15:23

మరియు నిశ్చయంగా, మేమే జీవన్మరణాలను ఇచ్చేవారము; మరియు చివరకు మేమే వారసులుగా మిగిలే వారము

Verse 24 — Surah Al-Hijr 15:24

మరియు వాస్తవానికి, మీకు ముందు గడిచి పోయిన వారిని గురించి మాకు తెలుసు మరియు వాస్తవంగా మీ తరువాత వచ్చే వారిని గురించి కూడా మాకు బాగా తెలుసు

Verse 25 — Surah Al-Hijr 15:25

మరియు నిశ్చయంగా, నీ ప్రభువు, ఆయనే! వారందరినీ సమావేశపరుస్తాడు. నిశ్చయంగా, ఆయన మహా వివేకవంతుడు, సర్వజ్ఞుడు

Verse 26 — Surah Al-Hijr 15:26

మరియు వాస్తవంగా మేము మానవుణ్ణి మ్రోగే (ధ్వని చేసే) మట్టి, రూపాంతరం చెందిన జిగట బురద (బంకమట్టి)తో సృష్టించాము

Verse 27 — Surah Al-Hijr 15:27

మరియు దీనికి పూర్వం మేము జిన్నాతులను (పొగలేని) మండే అగ్నిజ్వాలతో సృష్టించాము

Verse 28 — Surah Al-Hijr 15:28

మరియు నీ ప్రభువు దేవదూతలతో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకో!): "నిశ్చయంగా నేను మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో మానవుణ్ణి సృష్టించబోతున్నాను

Verse 29 — Surah Al-Hijr 15:29

ఇక నేను అతనికి పూర్తిగా ఆకారమిచ్చి (రూపమిచ్చి), అతని (ఆదమ్) లో నా తరఫు నుండి ప్రాణం (రూహ్) ఊదిన తరువాత, మీరంతా అతని ముందు సాష్టాంగం (సజ్దా) చేయాలి

Verse 30 — Surah Al-Hijr 15:30

అప్పుడు దేవదూతలు, అందరూ కలిసి సాష్టాంగం (సజ్దా) చేశారు

Verse 31 — Surah Al-Hijr 15:31

ఒక్క ఇబ్లీస్ తప్ప! అతడు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరనని మొండికేశాడు

Verse 32 — Surah Al-Hijr 15:32

(అల్లాహ్) ఇలా ప్రశ్నించాడు: "ఓ ఇబ్లీస్! నీకేమయింది, నీవు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో ఎందుకు చేరలేదు

Verse 33 — Surah Al-Hijr 15:33

(ఇబ్లీస్) ఇలా జవాబిచ్చాడు: "మ్రోగే మట్టి, రూపాంతరం చెందిన జిగట బురదతో నీవు సృష్టించిన మానవునికి నేను సాష్టాంగం (సజ్దా) చేసే వాడను కాను

Verse 34 — Surah Al-Hijr 15:34

(అల్లాహ్) అన్నాడు: "అయితే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో! ఇక, నిశ్చయంగా, నీవు శపించ (బహిష్కరించ) బడ్డవాడవు

Verse 35 — Surah Al-Hijr 15:35

మరియు నిశ్చయంగా, తీర్పు దినము వరకు నీపై శాపం (బహిష్కారం) ఉంటుంది

Verse 36 — Surah Al-Hijr 15:36

(ఇబ్లీస్) వేడుకున్నాడు: "ఓ నా ప్రభూ! పునరుత్థాన దినం వరకు నాకు వ్యవధినివ్వు

Verse 37 — Surah Al-Hijr 15:37

(అల్లాహ్) జవాబిచ్చాడు: "ఇక నిశ్చయంగా, నీవు వ్యవధి ఇవ్వబడిన వారిలోని వాడవు

Verse 38 — Surah Al-Hijr 15:38

(నాకు మాత్రమే) తెలిసి వున్న ఆ దినపు, ఆ సమయం వరకు

Verse 39 — Surah Al-Hijr 15:39

(ఇబ్లీస్) అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు నన్ను అపమార్గం పట్టించావు, కావున నేను వారికి, భూమిలో (వారి దుష్కర్మలన్నీ) మంచివిగా కనబడేటట్లు చేస్తాను మరియు నిశ్చయంగా, వారందరినీ అపమార్గంలో పడవేస్తాను

Verse 40 — Surah Al-Hijr 15:40

వారిలో నీవు ఎన్నుకున్న (నీ ఆజ్ఞానువర్తనులైన) నీ దాసులు తప్ప

Verse 41 — Surah Al-Hijr 15:41

(అల్లాహ్) అన్నాడు: "ఇదే మా దగ్గరకు తెచ్చే ఋజుమార్గం

Verse 42 — Surah Al-Hijr 15:42

నిశ్చయంగా, నా దాసులపై నీ అధికారం సాగదు! కేవలం మార్గభ్రష్టులైన నిన్ను అనుసరించేవారి మీద తప్ప

Verse 43 — Surah Al-Hijr 15:43

మరియు నిశ్చయంగా, వారందరి కొరకు వాగ్దానం చేయబడిన (నివాసం) నరకమే

Verse 44 — Surah Al-Hijr 15:44

దానికి (నరకానికి) ఏడు ద్వారాలు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క వర్గం వారు ప్రత్యేకించబడి ఉన్నారు

Verse 45 — Surah Al-Hijr 15:45

నిశ్చయంగా, దైవభీతి గలవారు స్వర్గవనాలలో చెలమల మధ్య ఉంటారు

Verse 46 — Surah Al-Hijr 15:46

వారు: 'శాంతితో సురక్షితంగా ప్రవేశించండి!' అని ఆహ్వానించబడతారు

Verse 47 — Surah Al-Hijr 15:47

వారి హృదయాలలో మిగిలి వున్న కాపట్యాన్ని (మాలిన్యాన్ని) మేము తొలగిస్తాము. వారు సోదరుల వలే ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు

Verse 48 — Surah Al-Hijr 15:48

అక్కడ వారికి అలసట ఉండదు. మరియు అక్కడి నుండి వారు ఎన్నడూ వెడల గొట్టబడరు

Verse 49 — Surah Al-Hijr 15:49

నా దాసులకు ఇలా తెలియజెయ్యి: "నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించే వాడను, కరుణించేవాడను

Verse 50 — Surah Al-Hijr 15:50

మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష

Verse 51 — Surah Al-Hijr 15:51

మరియు వారికి ఇబ్రాహీమ్ అతిథులను గురించి తెలుపు

Verse 52 — Surah Al-Hijr 15:52

వారు అతని వద్దకు వచ్చి: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: "నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది

Verse 53 — Surah Al-Hijr 15:53

వారు జవాబిచ్చారు: "నీవు భయపడకు! నిశ్చయంగా, మేము జ్ఞానవంతుడైన ఒక కుమారుని శుభవార్తను నీకు ఇస్తున్నాము

Verse 54 — Surah Al-Hijr 15:54

(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్యమైన) శుభవార్తను ఇస్తున్నారు

Verse 55 — Surah Al-Hijr 15:55

వారన్నారు: "మేము నీకు సత్యమైన శుభవార్తను ఇచ్చాము. కనుక నీవు నిరాశ చెందకు

Verse 56 — Surah Al-Hijr 15:56

(ఇబ్రాహీమ్) అన్నాడు: "తన ప్రభువు కారుణ్యం పట్ల నిరాశ చెందేవారు మార్గభ్రష్టులు తప్ప మరెవరు

Verse 57 — Surah Al-Hijr 15:57

(ఇంకా) ఇలా అన్నాడు: "ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి

Verse 58 — Surah Al-Hijr 15:58

వారన్నారు: "వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము

Verse 59 — Surah Al-Hijr 15:59

లూత్ ఇంటివారు తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము

Verse 60 — Surah Al-Hijr 15:60

అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): "నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము

Verse 61 — Surah Al-Hijr 15:61

తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు

Verse 62 — Surah Al-Hijr 15:62

(లూత్) అన్నాడు: "నిశ్చయంగా, మీరు (నాకు) పరాయివారిగా కన్పిస్తున్నారు

Verse 63 — Surah Al-Hijr 15:63

వారన్నారు: "కాదు! వాస్తవానికి వారు (దుర్మార్గులు) దేనిని గురించి సందేహంలో పడి ఉన్నారో, దానిని (ఆ శిక్షను) తీసుకొని నీ వద్దకు వచ్చాము

Verse 64 — Surah Al-Hijr 15:64

మరియు మేము నీ వద్దకు సత్యాన్ని తెచ్చాము. మరియు మేము నిశ్చయంగా, సత్యం పలుకుతున్నాము

Verse 65 — Surah Al-Hijr 15:65

కావున నీవు కొంత రాత్రి మిగిలి ఉండగానే, నీ ఇంటి వారిని తీసుకొని బయలుదేరు, నీవు వారి వెనుక పో! మీలో ఎవ్వరూ కూడా వెనుదిరిగి చూడరాదు; మరియు మీరు, మీకు ఆజ్ఞాపించిన వైపునకే పోతూ ఉండండి

Verse 66 — Surah Al-Hijr 15:66

మరియు (మా దూతల ద్వారా) మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము: "నిశ్చయంగా, తెల్లవారే సరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు

Verse 67 — Surah Al-Hijr 15:67

మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు

Verse 68 — Surah Al-Hijr 15:68

(లూత్) అన్నాడు: "వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి

Verse 69 — Surah Al-Hijr 15:69

మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి

Verse 70 — Surah Al-Hijr 15:70

వారన్నారు: "ప్రపంచంలోని (ప్రతి వాణ్ణి) వెనకేసుకోకు!" అని మేము నిన్ను వారించలేదా

Verse 71 — Surah Al-Hijr 15:71

(లూత్) అన్నాడు: "మీకు (ఏమైనా) చేయాలనే ఉంటే, నా కుమార్తెలు (జాతి స్త్రీలు) ఉన్నారు

Verse 72 — Surah Al-Hijr 15:72

నీ ప్రాణం సాక్షి! నిశ్చయంగా, వారు తమ (కామ) మత్తులో త్రోవ తప్పి తిరుగుతున్నారు

Verse 73 — Surah Al-Hijr 15:73

ఆ పిదప సూర్యోదయ సమయమున ఒక భయంకరమైన గర్జన (సయ్ హా) వారిని పట్టుకున్నది

Verse 74 — Surah Al-Hijr 15:74

తరువాత మేము ఆ నగరాన్ని తలక్రిందులుగా చేశాము మరియు వారిపై కాల్చిన మట్టి గులకరాళ్ళను కురిపించాము

Verse 75 — Surah Al-Hijr 15:75

నిశ్చయంగా, ఇందులో దూరదృష్టి గలవారికి ఎన్నో సూచనలున్నాయి

Verse 76 — Surah Al-Hijr 15:76

మరియు వాస్తవానికి ఆ ప్రాంతం ఒక రహదారి పైననే ఉన్నది

Verse 77 — Surah Al-Hijr 15:77

నిశ్చయంగా, ఇందులో విశ్వసించిన వారికి ఒక సూచన ఉంది

Verse 78 — Surah Al-Hijr 15:78

మరియు అయ్ కహ్ (మద్ యన్) వాసులు కూడా దుర్మార్గులుగానే ఉండేవారు

Verse 79 — Surah Al-Hijr 15:79

కావున మేము వారి మీద కూడా ప్రతీకారం తీర్చుకున్నాము. మరియు ఆ రెండు (శిథిలాలు) కూడా ఒక స్పష్టమైన మార్గం మీద ఉన్నాయి

Verse 80 — Surah Al-Hijr 15:80

మరియు వాస్తవానికి హిజ్ర్ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు

Verse 81 — Surah Al-Hijr 15:81

మరియు వారికి కూడా మేము అద్భుత సూచన (ఆయాత్) లను ఇచ్చి ఉంటిమి. కాని వారు వాటి నుండి విముఖులై ప్రవర్తించారు

Verse 82 — Surah Al-Hijr 15:82

మరియు వారు కొండలను తొలచి గృహాలను నిర్మించుకునే వారు, సురక్షితంగా ఉండగలమని (భావిస్తూ)

Verse 83 — Surah Al-Hijr 15:83

చివరకు ఒక ఉదయమున ఒక తీవ్రమైన గర్జన (సయ్ హా) వారిపై కూడా వచ్చి పడింది

Verse 84 — Surah Al-Hijr 15:84

అప్పుడు వారు సంపాదించింది వారికి ఏ మాత్రం పనికి రాలేక పోయింది

Verse 85 — Surah Al-Hijr 15:85

మరియు మేము ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్యనున్న సర్వాన్ని కేవలం సత్యంతోనే సృష్టించాము. మరియు నిశ్చయంగా, తీర్పు గడియ రానున్నది. కావున నీవు ఉదార భావంతో వారిని ఉపేక్షించు

Verse 86 — Surah Al-Hijr 15:86

నిశ్చయంగా, నీ ప్రభువు ఆయనే సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు

Verse 87 — Surah Al-Hijr 15:87

మరియు మేము నిశ్చయంగా, నీకు తరచుగా పఠింపబడే ఏడు (సూక్తులను) మరియు సర్వోత్తమ ఖుర్ఆన్ ను ప్రసాదించాము

Verse 88 — Surah Al-Hijr 15:88

వారిలో (అవిశ్వాసులలో) కొందరికి మేము ఒసంగిన ఐహిక సంపదలను నీవు కన్నెత్తి కూడా చూడకు. మరియు వారి (అవిశ్వాస) వైఖరికి బాధపడకు. మరియు విశ్వసించిన వారికి ఆశ్రయం (ఛాయ) ఇవ్వటానికి నీ రెక్కలను విప్పు

Verse 89 — Surah Al-Hijr 15:89

మరియు (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నిశ్చయంగా, నేను స్పష్టమైన హెచ్చరిక చేసే వాడను మాత్రమే

Verse 90 — Surah Al-Hijr 15:90

ఏ విధంగానైతే మేము (గ్రంథాన్ని), విభజించే వారిపై అవతరింపజేశామో

Verse 91 — Surah Al-Hijr 15:91

ఎవరైతే ఈ ఖుర్ఆన్ ను (తమ తిరస్కారంతో) ముక్కలు ముక్కులుగా చేశారో

Verse 92 — Surah Al-Hijr 15:92

నీ ప్రభువు సాక్షిగా! నిశ్చయంగా, మేము వారందరినీ ప్రశ్నిస్తాము

Verse 93 — Surah Al-Hijr 15:93

వారు చేస్తూ ఉండిన కర్మలను గురించి

Verse 94 — Surah Al-Hijr 15:94

కావున నీకు ఆజ్ఞాపించబడిన దానిని బహిరంగంగా చాటించు. మరియు అల్లాహ్ కు సాటి కల్పించే వారి (ముష్రికీన్) నుండి విముఖుడవకు

Verse 95 — Surah Al-Hijr 15:95

నిశ్చయంగా, నీతో పరిహాసాలాడే వారి నుండి నిన్ను రక్షించటానికి మేమే చాలు

Verse 96 — Surah Al-Hijr 15:96

ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను కూడా (ఆరాధనకు) నియమించుకుంటున్నారో, వారు త్వరలోనే (సత్యాన్ని) తెలుసుకుంటారు

Verse 97 — Surah Al-Hijr 15:97

మరియు వాస్తవానికి వారు పలికే మాటల వలన నీ హృదయానికి తప్పక కష్టం కలుగుతుందని మాకు బాగా తెలుసు

Verse 98 — Surah Al-Hijr 15:98

కావున నీవు నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ స్తోత్రం చేస్తూ ఉండు మరియు సాష్టాంగం (సజ్దా) చేసే వారిలో చేరు

Verse 99 — Surah Al-Hijr 15:99

మరియు తప్పక రాబోయే ఆ అంతిమ ఘడియ (మరణం) వచ్చే వరకు, నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు